SpaceX: ఐఎస్‌ఎస్‌లోకి చేరుకున్న క్రూ డ్రాగన్‌ ! త్వరలో భూమి మీదకు సునీత !

ఐఎస్‌ఎస్‌లోకి చేరుకున్న క్రూ డ్రాగన్‌ ! త్వరలో భూమి మీదకు సునీత !

SpaceX : నలుగురు వ్యోమగాములతో నింగిలోకి పయనమైన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ (క్రూ డ్రాగన్‌ క్యాప్సూల్‌-10) విజయవంతంగా భూ కక్ష్యలోనికి ప్రవేశించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానమైంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం 9.37గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఐఎస్ఎస్)తో అనుసంధానమైంది. ఈ వ్యోమ నౌక ఐఎస్ఎస్ కు అనుసంధానం కాగానే… ఐఎస్ఎస్(ISS) లో ఉన్న ఏడుగురు సిబ్బంది వ్యోమ నౌకలో ఉన్న నలుగురు వ్యోమగాములకు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో సునీతా విలియమ్స్‌(Suneetha Williams), బుచ్‌ విల్మోర్‌ కూడా ఉన్నారు.

SpaceX Reached

దీనితో 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌లు కొద్దిరోజుల్లో భూమికి తిరిగిరావడానికి మార్గం సుగమమం అయింది. వీరు ఇదే వ్యోమ నౌకలో త్వరలో భూమ్మీదకు రానున్నారు. ఐఎస్ఎస్ షెడ్యూల్‌ ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఐఎస్ఎస్ నుంచి వీరు బయల్దేరుతారు. గురువారం అర్ధరాత్రి కల్లా ఈ వ్యోమనౌక భూమని చేరే అవకాశం ఉంది. సునీత, విల్మోర్‌లతో పాటు అమెరికాకు చెందిన నిక్‌ హేగ్‌, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ కూడా ఈ వ్యోమ నౌకలో భూమి మీదకు రానున్నారు.

నలుగురు వ్యోమగాములతో నింగిలోకి పయనమైన స్పేస్‌ఎక్స్‌(SpaceX) వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానమైంది. ‘క్రూ-10 మిషన్‌’లో భాగంగా శనివారం అమెరికాలోని కేప్‌ కెనావెరాల్‌ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్‌లో నలుగురు వ్యోమగాములు నింగిలోకి పయనమైన సంగతి తెలిసిందే. ఇందులో అమెరికాకు చెందిన ఆన్‌ మెక్‌క్లెయిన్, నికోల్‌ అయర్స్, జపాన్‌ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్‌ పెస్కోవ్‌లు ఉన్నారు. సునీత, విల్మోర్, భూమికి తిరిగి రానున్న మరో ఇద్దరు వ్యోమగాముల స్థానంలో వీరు ఐఎస్‌ఎస్‌లో విధులు నిర్వర్తిస్తారు. ఆదివారం ఉదయం 9:37 గంటలకు క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక… భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. అనంతరం విల్మోర్‌… అంతరిక్ష కేంద్ర ద్వారాన్ని తెరిచారు. ఆనవాయితీ ప్రకారం వ్యోమనౌక బెల్‌ను మోగించారు. దీనితో క్రూ-10 వ్యోమగాములు నలుగురు… ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వీరికి సునీత, విల్మోర్, ఐఎస్‌ఎస్‌లోని మరో ఐదుగురు వ్యోమగాములు స్వాగతం పలికారు. వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘‘ఇది అద్భుతమైన రోజు’’ అని సునీత పేర్కొన్నారు.

వాతావరణం అనుకూలిస్తే బుధవారం సునీత, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములతో స్పేస్‌ఎక్స్‌(SpaceX) క్యాప్సూల్‌ ఐఎస్‌ఎస్‌ నుంచి విడిపోయి… భూమికి పయనమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగరజలాల్లో దిగుతుంది. సునీత బృందం తిరుగుప్రయాణమయ్యే వరకూ ఐఎస్‌ఎస్‌లో 11 మంది వ్యోమగాములు ఉంటారు.

సునీతకు నామమాత్రపు వేతనం

సుదీర్ఘ కాలం అంతరిక్షంలోనే ఉండిపోయినందుకు సునీత, విల్మోర్‌లకు అదనంగా ప్రత్యేక వేతనాన్ని చెల్లించే అవకాశం లేదని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్‌మన్‌ పేర్కొన్నారు. ఈ వ్యోమగాములిద్దరూ ఫెడరల్‌ ఉద్యోగులు అయినందువల్ల… అంతరిక్షంలో వారు పనిచేసిన కాలాన్ని భూమ్మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని చెప్పారు. సాధారణంగా వచ్చే జీతంతోపాటు ఐఎస్‌ఎస్‌లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుందన్నారు. ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు నాలుగు డాలర్ల (సుమారు రూ.348) భత్యం మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

2010-11లో మిషన్‌లో భాగంగా 159 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లో ఉన్నానని, అందుకు మొత్తంగా 636 డాలర్లు మాత్రమే తనకు అదనంగా చెల్లించారన్నారు. ఈ లెక్కన సునీత, విల్మోర్‌లకు తొమ్మిది నెలలకు గాను దాదాపు 1100 డాలర్లు (సుమారు రూ.లక్ష) మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. నాసా ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల తరహా జీతభత్యాలే అందుతాయి. సునీత, విల్మోర్‌లు అత్యధిక గ్రేడ్‌ జీఎస్‌-15 గ్రేడ్‌ పే జీతం అందుకుంటున్నారు. వీరి వార్షిక వేతనం 1,24,133 డాలర్ల నుంచి 1,62,672 డాలర్ల (సుమారు రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41కోట్లు) మధ్యన ఉంటుందని సమాచారం.

Also Read : Vijayasai Reddy : జగన్ కోటరీపై మరోసారి విరుచుకుపడిన విజయసాయిరెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!