Kinjarapu Ram Mohan Naidu: జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి - కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Ram Mohan Naidu : భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో దేశం రూపురేఖలు మారుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) అన్నారు. ముంబై, నోయిడా, భోగాపురం ఎయిర్ పోర్టులు దేశంలోనే అత్యాధునిక ఎయిర్ పోర్టులుగా నిలుస్తాయన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో అతి పెద్ద రన్ వే… 3.8 కిలోమీటర్ల పొడవైన రన్ వేను భోగాపురం ఎయిర్ పోర్ట్ లో నిర్మిస్తున్నామన్నారు. మంగళవారం ఆయన భోగాపురం విమానాశ్రయం పనులను పరిశీలించి… అక్కడ జరుగుతున్న పనుల్లో పురోగతిపై జీఎంఆర్‌ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్కుఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, కలెక్టర్ బి.ఆర్.అంబేద్కర్,ఎస్.పి వకుల్ వకుల్ జిందాల్ , ఆర్.డి.ఓ కీర్తి, జి.ఎం. ఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.ప్రభాకర్ రావు , సి.ఈ.ఓ కన్వర్ బి సింగ్ కల్ర , మేనేజర్ రామరాజు, సి.డి.ఓ ఎం.కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Union Minister Ram Mohan Naidu gives Update on Bhogapuram Airport

ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్‌ నాయుడు(Ram Mohan Naidu) మాట్లాడుతూ… భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసేలా విమానాశ్రయంలో ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్(Bhogapuram Airport) ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని ముందుగా అనుకున్నప్పటికీ గడిచిన 6 నెలలుగా పనుల వేగాన్ని పెంచడంతో అనుకున్న కన్నా ముందే ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేసుకొని జూన్ 2026 నాటికే ప్రారంభించడం జరుగుతుందన్నారు. నవంబర్ లో ఓవరాల్ గా 49 శాతంగా ఉన్న పనులు నేడు 71 శాతానికి పెరిగిందని, ఎర్త్ వర్క్స్ పూర్తి అయిందని తెలిపారు. రన్ వే 97 శాతం, టాక్సీ వే 92 శాతం, టెర్మినల్ బిల్డింగ్ 60 శాతం, ఏటిసి టవర్ – 72 శాతం, యాన్సిలరీ భవనాలు – 43 శాతం , మెయిన్ అప్రోచ్ రహదారుల పనులు 37 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు.

గత పాలకుల నిర్లక్యం కారణంగా 26శాతంగా ఉన్న విమానాశ్రయం నిర్మాణం పనులు నేడు 71 శాతానికి చేరుకున్నాయని తెలిపారు. దేశంలో అతి అధునాతన ఎయిర్ పోర్టులైన ముంబాయి , నోయిడా, భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంతో దేశం రూపు రేఖలు మారనున్నాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొందని, భవిష్యత్ లో అన్ని రకాల సదుపాయాలతో ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నామని తెలిపారు. దేశంలో అతి పెద్ద రన్ వే 3.8 కిలోమీటర్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. స్థానికంగానే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్ , ఇతర ఎకనామిక్ కార్యక్రమాలను, వ్యాపార అభివృద్ధికి అవసరమగు శిక్షణలను ఇవ్వడం జరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎయిర్పోర్ట్ ప్రారంభం అయ్యే నాటికి తాజ్ గ్రూప్ హోటల్ కూడా ప్రారంభం అయ్యేలా చూస్తామన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయం, కళలు ఉట్టిపడేలా విమానాశ్రయం లోపల ఇంటీరియర్ డిజైన్ చేపడుతున్నట్లు తెలిపారు.

విశాఖ ట్రాఫిక్ ను ప్రధాన అంశంగా పరిగణలోకి తీసుకున్నమని, వైజాగ్ పోర్ట్ నుండి మూల పేట పోర్ట్ వరకు కనెక్టివిటీ కోసం కొత్త డి.పి.ఆర్ లను తయారు చేయడం జరిగిందన్నారు. తీర ప్రాంత అభివృద్ధి, పర్యటకాభివృద్ధికి అవకాశం ఉండేలా చూస్తామన్నారు. అనకాపల్లి, ఆనందపురం బై పాస్ రహదారిని భోగాపురం విమానాశ్రయానికి సరైన విధంగా కనెక్ట్ చేస్తామని తెలిపారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో సంబంధిత కేంద్ర మంత్రితో చర్చిస్తున్నామని అన్నారు. నిర్వాసితుల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, భూములిచ్చిన రైతులు నష్టపోకుండా చూస్తామని, అలాగే సర్వీస్ రోడ్ సమస్య ను కూడా ముఖ్యమంత్రి తో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలా ఎయిర్పోర్ట్ ఉంటుందని, ఉత్తరాంధ్రా ముఖ చిత్రం ఈ ఎయిర్పోర్ట్ మార్చుతుందని , ప్రస్తుతం జరుగుతున్న పనుల పట్ల సంతృప్తిగా ఉందని అన్నారు.

Also Read : YS Jagan: పోలీసులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మాస్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!