Nainar Nagendran: తమిళనాడు బీజేపీ చీఫ్ గా నయినార్‌ నాగేంద్రన్‌

తమిళనాడు బీజేపీ చీఫ్ గా నయినార్‌ నాగేంద్రన్‌

Nainar Nagendran : దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ… తమిళనాడు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బీజేపీ చీఫ్ అన్నామలై పదవీకాలం ముగియడంతో కొత్త చీఫ్ ఎంపికకు నామినేషన్లు స్వీకరించింది. అయితే బీజేపీ చీఫ్ కు పదవికి కేవలం తిరునల్వేలి ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌(Nainar Nagendran) మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో… ఆయనే ఆ పదవిని అధిరోహించడం ఖాయమైపోయింది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.

Nainar Nagendran As a Tamil Nadu BJP Chief

తమిళనాడులో బీజేపీ(BJP) బలోపేతం దిశగా అధిష్టానం అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా పార్టీలో కొత్త సభ్యుల చేరిక గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభించారు. అనంతరం నవంబరులో శాఖల స్థాయిలో ఎన్నికలు చేపట్టి నిర్వాహకులను ఎంపిక చేశారు. తదుపరి మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో కొత్త జిల్లా అధ్యక్షులు నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు పదవికి జనవరిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ… ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సహా వివిధ కారణాలతో అధ్యక్ష పదవి ఎన్నికలో జాప్యం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి శనివారం ఎన్నిక జరగనుందని ప్రకటించారు. ఈ పదవికి పోటీచేసే అభ్యర్థులు, శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలని ఎన్నికల నిర్వాహకులు ప్రకటించారు.

అయితే బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్ష పదవికి నయినార్‌ నాగేంద్రన్‌ మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. నాగేంద్రన్‌ నామినేషన్‌ను ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై, మాజీ అధ్యక్షుడు పొన్‌.రాధాకృష్ణన్‌, హెచ్‌.రాజా, ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌, కనక సభాపతి, వీపీ దురైస్వామి, పొన్‌ బాలగణపతి తదితరులు బలపరిచారు. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం నాగేంద్రన్‌కు పార్టీ సీనియర్‌ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ సాయంత్రం 4 గంటలకు ముగియగా, ఇతరులెవ్వరూ దాఖలు చేయకపోవడంతో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నయినార్‌ నాగేంద్రన్‌ ఎన్నిక ఖరారైపోయింది.

అన్నాడీఎంకేతో మొదలైన నాగేంద్రన్‌ రాజకీయ ప్రస్థానం

రాష్ట్ర కమల దళాధిపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న దేవర్‌ సామాజిక వర్గానికి చెందిన 64 ఏళ్ల నయినార్‌ నాగేంద్రన్‌ రాజకీయ జీవితం అన్నాడీఎంకేతో మొదలైంది. తిరునల్వేలి జిల్లా పనకుడి సమీపం తండయార్‌ కుళానికి చెందిన నాగేంద్రన్‌ పీజీ డిగ్రీ చేశారు. ఆయనకు భార్య చంద్ర, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 1989లో అన్నాడీఎంకేలో చేరిన నాగేంద్రన్‌, పనకుడి నగర కార్యదర్శి, యువజన విభాగం కార్యదర్శి, తిరునల్వేలి నగర జిల్లా జయలలిత పేరవై కార్యదర్శి, రాష్ట్ర జయలలిత పేరవై కార్యదర్శి, ఎన్నికల విభాగం సంయుక్త కార్యదర్శి తదితర పదవులు నిర్వహించారు. 2001 తిరునల్వేలి శాసనసభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి విజయం సాధించి… నాటి ముఖ్యమంత్రి జయలలిత మంత్రివర్గంలో విద్యుత్‌, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. మళ్లీ 2006లో తిరునల్వేలి నియోజకవర్గంలో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2011లో జరిగిన ఎన్నికల్లో తిరునల్వేలి నియోజకవర్గం నుంచి ఎన్నికైనా, ఆయనకు మంత్రి పదవి లభించలేదు.

2017లో బీజేపీలో చేరిన నాగేంద్రన్‌

2016లో మళ్లీ తిరునల్వేలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి వైదొలిగి 2017లో బీజేపీలో చేరారు. అప్పటినుంచి బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 2019లో రామనాథపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి పరాజయం చవిచూశారు. అనంతరం 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరునల్వేలి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసే అవకాశం దక్కింది. ఆయనకు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రచారం చేశా రు. ఈఎన్నికల్లో నయినార్‌ నాగేంద్రన్‌ విజయం సాధించి, బీజేపీ శాసనసభ పక్షనేతగా వ్యవహరిస్తున్నారు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తిరునల్వేలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాగేంద్రన్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి రాబర్ట్‌ బ్రూస్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.

Also Read : Bengaluru Metro: మెట్రో స్టేషన్‌ లో ప్రేమికుల రొమాన్స్‌ ! సోషల్ మీడియాలో వైరల్ !

Leave A Reply

Your Email Id will not be published!