Mamata Banerjee: అమిత్ షాను కంట్రోల్ చేయండి – ప్రధాని మోదీకి మమత సూచన
అమిత్ షాను కంట్రోల్ చేయండి - ప్రధాని మోదీకి మమత సూచన
Mamata Banerjee : కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టం-2025కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని… ఇందుకోసం అమిత్ షా, బీఎస్ఎఫ్ కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను రాష్ట్రంలోని వదిలారని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. సొంత రాజకీయ అజెండాను నెరవేర్చుకోవడానికి దేశానికి హాని చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయవద్దని, అమిత్ షాను నియంత్రించాలని ఆమె ప్రధాని మోదీను కోరారు.
Mamata Banerjee Raised a Complaint
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్(West Bengal) లో చోటుచేసుకున్న హింసాకాండ వెనుక బంగ్లాదేశ్ హస్తం ఉందని నిఘా వర్గాలు తమకు తెలిపినట్టు మమత చెప్పారు. “ముర్షీదాబాద్ హింసాకాండలో బంగ్లాదేశ్ ప్రమేయం ఉందని హోం మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఒక ట్వీట్ ఏఎన్ఐలో చూశాను. ఇదే నిజమైతే, ఇందుకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. సరిహద్దు రక్షణ బాధ్యత చూసుకునేది బీఎస్ఎఫ్. రాష్ట్ర ప్రభుత్వం కాదు. బయట నుంచి వచ్చిన అల్లర్లు సృష్టించేందుకు బంగ్లాదేశీయులను రాష్ట్రంలోకి వదిలారు” అని సీఎం అన్నారు. ఘర్షణల్లో బీఎస్ఎఫ్ పాత్రపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మమత ఆదేశించారు. దేశ సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకమైన వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటులో వ్యతిరేకించడంలో టీఎంసీ ముందుందన్నారు. ఈ విషయంపై ప్రజలు శాంతియుత నిరసనలు చేపట్టాలని కోరారు. ఈ హింసాకాండలో మరణించిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నష్ట పరిహారం ఇస్తామని మమత ఈ సందర్భంగా ప్రకటించారు. బీజేపీ ఆమోదించిన ప్రజా వ్యతిరేక బిల్లులను కేంద్రంలో ప్రభుత్వాన్ని గద్దెదింపిన తర్వాత రీకాల్ చేస్తామని మమత స్పష్టం చేశారు.
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హూగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముర్షిదాబాద్ ప్రాంతంలో పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలతో అక్కడ విధ్వంసం చోటుచేసుకుంది. దీనితో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… 200 మందికి పైగా నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read : Election Commission: రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేసిన సీఈసీ