JEE Main Result: జేఈఈ మెయిన్ ఫలితాల్లో 110 మందికి షాక్
జేఈఈ మెయిన్ ఫలితాల్లో 110 మందికి షాక్
JEE Main Result : జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం అర్థరాత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. సుమారు 2.50 లక్షల మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించినట్టు వెల్లడించింది. 24 మంది 100 పర్సంటైల్ సాధించినట్టు తెలిపింది. అయితే 110 మంది ఫలితాలను ప్రకటించకుండా ఎన్టీఏ నిలిపివేసింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వీరి ఫలితాలను ప్రకటించలేదని ఎన్టీఏ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫోర్జరీ పత్రాలు ఉపయోగించడం పాటు రకరకాలుగా మోసాలకు పాల్పడినట్టు ఆరోపించింది.
JEE Main Result Update
వ్యక్తిగత వివరాల్లో వ్యత్యాసం కారణంగా మరో 23 మంది ఫలితాలను కూడా ప్రకటించలేదు. ఫొటోలు, బయోమెట్రిక్ డేటాలో తేడాల కారణంగా ఈ 23 మంది రిజల్ట్ విడుదల కాలేదు. వీరు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ సమర్పించాలని ఎన్టీఏ(NTA) సూచించింది. వీటిని పరిశీలించిన ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. తాము ఎటువంటి తప్పుచేయలేదని అభ్యర్థులు నిరూపించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
జేఈఈ మెయిన్(JEE Main Result) పరీక్షలు దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో జనవరి- ఏప్రిల్‌లో జరిగాయి. సెషన్ 1 పరీక్ష సమయంలో 39 మంది అభ్యర్థులు అక్రమాలకు పాల్పడినట్టు ఎన్టీఏ గుర్తించింది. సెషన్ 2లో ఇదే రకమైన ఆరోపణలతో 110 మందిని గుర్తించడంతో మొత్తం 149 మందిని అనుమానిత జాబితాలో చేర్చింది. వీరిలో 133 మంది ఫలితాలు విడుదల చేయకుండా ఎన్టీఏ నిలిపివేసింది. తాము నిబంధలను ఉల్లంఘించలేదని నిరూపించుకున్న తర్వాతే వీరి పరీక్షా ఫలితాలను వెల్లడిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. నిష్పాక్షికత, పారదర్శకత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని కుండబద్దలు కొట్టింది.
సరైన పత్రాలతో తమను సంప్రదించండి
ఫలితాలు విడుదలకాని అభ్యర్థులు సరైన పత్రాలతో తమను సంప్రదించాలని ఎన్టీఏ(NTA) సూచించింది. కరెక్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఎథికల్ కండక్ట్ కలిగివుంచాలని వెల్లడించింది. పరీక్షల్లో అర్హత సాధించడానికి అనైతిక మార్గాలు అనుసరించకుండా అడ్డుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు తమకు సహకరించాలని కోరింది.
దేశంలో అత్యంత పోటీ ఉండే జేఈఈ పరీక్షల(JEE Mains) నిర్వహణకు ఎన్టీఏ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. పలు రకాలుగా భద్రత ఏర్పాటు చేస్తోంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఏఐ- ఆధారిత వీడియో ఎనలిటిక్స్, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెడుతోంది. పరీక్షల్లో డిజిటిల్ అక్రమాలను నిరోధించేందుకు ఎగ్జామ్స్ సెంటర్ల వద్ద 5జీ జామర్లను అమరుస్తోంది. అంతేకాదు కొత్తగా అందుబాటులోకి వచ్చిన పరీక్షా కేంద్రాల్లో థర్డ్ పార్టీ ఏజెన్సీలతో ముందుగానే తనిఖీలు నిర్వహించింది. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 1100 మందికి పైగా పరీక్షా నిర్వాహకులు, భాగస్వాములకు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చింది. ఢిల్లీలోని సెంట్రల్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాల్లోని కదలికలను గమనిస్తూ అలర్ట్ చేసింది.
పరీక్షకు ముందు రోడ్డు ప్రమాదం ! అయినా జేఈఈ టాపర్ గా ఆర్కిస్‌మ్యాన్ నాండి !
జీవితంలో మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. అది అక్షరం సత్యం. పశ్చిమ బెంగాల్ కు చెందిన జేఈఈ టాపర్ ఆర్కిస్‌మ్యాన్ నాండి జీవితమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. జనవరి 29న జేఈఈ మెయిన్ సెసన్ 1 పరీక్ష ఉండింది. జనవరి 26న ఆర్కిస్‌మ్యాన్ నాండి కుటుంబం కారులో కోల్‌కతా బయలు దేరింది. హౌరాలోని అంకుర్హతి దగ్గర వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం తీవ్రత కారణంగా కారు బాగా దెబ్బతింది. అయితే, దేవుడి దయవల్ల లోపల ఉన్న ఆర్కిస్‌మ్యాన్ నాండితో పాటు అతడి తల్లిదండ్రులకు కూడా ఏమీ కాలేదు. అంత పెద్ద ప్రమాదం జరిగినా .. చిన్న గాయాలు కూడా కాకుండా బయటపడ్డారు.
యాక్సిడెంట్ అతడ్ని భయపెట్టలేకపోయింది. జనవరి 29న ఆర్కిస్‌మ్యాన్ నాండి జేఈఈ మెయిన్(JEE Mains) సెసన్ 1 పరీక్షలో పాల్గొన్నాడు. చక్కగా పరీక్షపూర్తి చేశాడు. అందులో 99.98757 శాతం సాధించాడు. జేఈఈ మెయిన్ సెసన్ 2లో కూడా అతడు తన సత్తా చాటాడు. 100 శాతంతో స్టేట్ టాపర్ గా నిలిచాడు. ఈ సందర్భంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆర్కిస్‌మ్యాన్ నాండి మాట్లాడుతూ… ‘ నాకు ఫిజిక్స్, మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదవాలని అనుకుంటున్నా. బీటెక్ తర్వాత రీసెర్చ్ చేస్తాను’ అని అన్నాడు.
Also Read : JP Nadda: సుప్రీంకోర్టుపై బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన అధ్యక్షుడు జేపీ నడ్డా