Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్ సిద్దిఖీకి ‘డి’ కంపెనీ బెదిరింపులు
బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్ సిద్దిఖీకి ‘డి’ కంపెనీ బెదిరింపులు
Zeeshan Siddique : మహారాష్ట్ర దివంగత నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎన్సీపీ నేత జీషన్ సిద్దిఖీను(Zeeshan Siddique) గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. నీ తండ్రి బాబా సిద్ధిఖీని చంపినట్లే నిన్నూ చంపేస్తామంటూ మెయిల్ చేశారు. తక్షణమే రూ.10 కోట్లు ఇవ్వాలని వారు ఆ మెయిల్ ద్వారా డిమాండ్ చేశారు. నువ్వు డబ్బు చెల్లించకపోతే… నీ తండ్రి లాగే నిన్ను కూడా చంపేస్తామని మెయిల్ లో రాసి ఉంది. బెదిరింపు చేస్తున్న వ్యక్తి తనను తాను ‘డి-కంపెనీ’ సభ్యుడిగా చెప్పుకున్నాడు. అంతేకాదు ఈ విషయం పోలీసులకు తెలుపవద్దని జీషన్‌ను హెచ్చరించారు. దీనితో ఈ బెదిరింపు మెయిల్ పై తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని జీషాన్… ఇటీవల ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Zeeshan Siddique – జీషన్ ఇంటికి బాంద్రా పోలీసులు
హత్య బెదిరింపులు వచ్చిన తర్వాత, జీషన్ సిద్ధిఖీ(Zeeshan Siddique)… పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తరువాత, బాంద్రా పోలీసులు అతని ఇంటికి చేరుకుని ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో జీషాన్‌కు ఎవరు ఇమెయిల్ చేశారు, ఎవరు బెదిరించారనే వివరాలను ఆరా తీస్తున్నారు.
గతంలో కూడా బెదిరింపులు
గత ఆరు నెలల్లో జీషాన్‌కు అనేకసార్లు హత్యా బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 2024లో నోయిడాకు చెందిన 20 ఏళ్ల టాటూ ఆర్టిస్ట్ మహ్మద్ తయ్యబ్, వాట్సాప్ ద్వారా జీషన్ ను బెదిరించినందుకు అరెస్ట్ అయ్యాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ డ్రోన్లతో దాడి చేయాలని ప్లాన్ చేస్తోందని అతను పేర్కొన్నాడు. గత సంవత్సరం, ఆజం మొహమ్మద్ ముస్తఫా అనే 56 ఏళ్ల వ్యక్తి కూడా ముంబై ట్రాఫిక్ పోలీసు హెల్ప్ లైన్ కు వాట్సాప్ సందేశం పంపించి ద్వారా జీషన్‌ను బెదిరించాడు. ఇందులో అతను జీషన్, సల్మాన్ ఖాన్ నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. ముస్తఫా సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన నిరుద్యోగి. ఆ మరుసటి రోజే అతన్ని అరెస్టు చేశారు. జీషన్ సిద్ధిఖీ తండ్రి హత్య తర్వాత, అనేక బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అతని భద్రతను కట్టుదిట్టం చేశారు. అతనికి ‘Y’ కేటగిరీ భద్రతను కల్పించారు పోలీసులు.
2024 అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీ ముంబయిలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా… కొందరు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించింది. బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు అక్షదీప్ గిల్ ను పంజాబ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్ణోయ్ అని పోలీసులు తేల్చారు.
Also Read : Raj Kasireddy: మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్