Pawan Kalyan: పహల్గాం ఉగ్రదాడి మృతులకు సీఎం, డిప్యూటీ సీఎం నివాళులు

పహల్గాం ఉగ్రదాడి మృతులకు సీఎం, డిప్యూటీ సీఎం నివాళులు

Pawan Kalyan : జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నివాళులర్పించారు. గురువారం కావలి చేరుకున్న పవన్… నేరుగా మధుసూదనరావు ఇంటికి వెళ్లి… ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆపై కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Pawan Kalyan Tributes Pahalgam Victims

అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ… కాశ్మీర్‌లో కిరాతకంగా తూటాలు పేలిస్తే, దేశ వ్యాప్తంగా మధుసూదనరావుకు నివాళులర్పించారన్నారు. ఈ సంఘటనను కుటుంబ సభ్యులు ఇంకా నమ్మలేకపోతున్నారని తెలిపారు. వారితో మాట్లాడినప్పుడు… ఆయన భార్య, పిల్లలు ఏం జరిగింది.. ఎలా జరిగిందో చెప్పారన్నారు. వాళ్లు చెబుతుంటే తనకే పేగులు మెలబెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చారంటే అది ఎంతటి దారుణమో అని మండిపడ్డారు. తాను మాట్లాడలేక పోతున్నానని… రేపో, ఎల్లుండో మంగళగిరిలో ప్రెస్‌ మీట్ పెట్టి అన్ని వివరిస్తానని తెలిపారు. కాశ్మీర్ రెండేళ్లుగా ప్రశాంతంగా ఉందనే ఇంతటి దారుణానికి, కిరాతకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. సమ్మర్‌ లో షూటింగ్‌ కోసం కాశ్మీర్‌ కు చాలా సార్లు వెళ్లానని… అక్కడ పరిస్థితులు తనకు తెలుసన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. పవన్ వెంట మంత్రులు ఆనం, నాదెండ్ల, సత్యకుమార్, ఎమ్మెల్యేలు కావ్యా కృష్ణారెడ్డి, సోమిరెడ్డి, ఆర్ఎస్ఎస్ జాతీయనేత మధుకర్ ఉన్నారు.

కాగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో(Pahalgam) జరిగిన ఉగ్రమూకల దాడిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్‌రావు ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడ్డ మధుసూదన్ ఫ్యామిలీతో కలిసి పహల్గాం విహారాయత్రకు వెళ్లారు. అయితే ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అతడు మృతిచెందాడు. బుధవారం రాత్రి మధుసూదన్‌ మృతదేహాన్ని చెన్నై ఎయిర్‌పోర్టుకు… అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు జిల్లా కావలికి తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపించారు. ఇక పెహల్గాం ఉగ్రదాడిలో మరో ఏపీ వాసి కూడా ప్రాణాలు కోల్పోయాడు. విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ఉగ్రమూకల దాడిలో మృతిచెందాడు.

విశాఖలో చంద్రమౌళి భౌతికకాయానికి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు

పహల్గాంలో ఉగ్ర దాడిలో మృతి చెందిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహాన్ని బుధవారం రాత్రి అధికారులు విశాఖ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. చంద్రబాబు అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన చంద్రమౌళి, కావలికి చెందిన మధుసూదనరావు చిత్రపటాలతో నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు(CM Chandrababu) మీడియాతో మాట్లాడుతూ… ‘దేశానికి ఎంతో కీలకమైన కశ్మీర్‌ లో ఇటీవల ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించి గత మూడేళ్లుగా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అలాంటి సమయంలో ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండించాలి’ అని పేర్కొన్నారు.

ఈ ఉగ్రమూకలు భారత్‌ ను ఏమీ చేయలేవు – సీఎం చంద్రబాబు

‘ఉగ్రమూకల దాడి నన్ను షాక్‌ కు గురి చేసింది. విహారానికి వెళ్లిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం తీవ్ర విషాదకరం. చంద్రమౌళితో పాటు వెళ్లిన ప్రత్యక్షసాక్షి శశిధర్‌ చెప్పినదాన్ని బట్టి చూస్తే ఉగ్రవాదులు అనాగరికంగా, మానవత్వం లేకుండా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆడవాళ్లను వదిలిపెట్టి మగవారినే కాల్చడం చూస్తే ప్రణాళిక ప్రకారం చేసినట్లు అర్థమవుతుంది’ అన్నారు. ‘దేశంలో సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం ఉంది. ఇలాంటి టెర్రరిస్టులు భారత్‌ ను ఏమీ చేయలేరు. ఈ తరహా ఘటనలతో అలజడి రేపాలని చూడటం వాళ్ల అవివేకం. క్లిష్టపరిస్థితులు వచ్చినప్పుడు దేశమంతా సమైక్యంగా నిలబడాలి. అందరం మోదీ నాయకత్వంలో కేంద్రం చేసే ప్రతి కార్యక్రమానికీ సంఘీభావం తెలియజేయాలి. దేశ సమగ్రత, సుస్థిరతను దెబ్బతీసేందుకు ఎలాంటి వ్యక్తులు, శక్తులు ప్రయత్నించినా దాన్ని దీటుగా ఎదుర్కొంటామని సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

‘ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మధుసూదనరావును పోగొట్టుకున్నాం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. ఏపీ ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తాం. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, హోం మంత్రి అనిత, విశాఖ ఎంపీ శ్రీభరత్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డీబీవీ స్వామి, విప్‌ గణబాబు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ, విష్ణుకుమార్‌రాజు, రామకృష్ణబాబు, రమేష్‌బాబు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు తదితరులున్నారు.

Also Read : Deputy CM Pawan Kalyan: ఇష్టపూర్వకంగా పంచాయితీరాజ్ శాఖను ఎంచుకున్నా – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Leave A Reply

Your Email Id will not be published!