Simhachalam: సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి ! గోడకూలి 8 మంది భక్తులు మృతి !

సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి ! గోడకూలి 8 మంది భక్తులు మృతి !

Simhachalam : సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు రూ.300 టికెట్‌ క్యూలైన్‌ లో నిలబడి ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈఘటనలో ముగ్గురు మహిళలతో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈదుడు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా భారీ టెంట్ విరిగిపడి… ఇటీవలే నిర్మించిన గోడపై పడటంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, దేవాదయ శాఖక సిబ్బంది… సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల క్రింద చిక్కుకున్న క్షతగాత్రులను, మృతదేహాలను వెలికి తీస్తున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీసు కమీషనర్ శంకబ్రతా బాగ్చీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

Simhachalam – సింహాచలం ఘటన నన్ను కలచివేసింది – సీఎం చంద్రబాబు

సింహాచలం(Simhachalam) శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ప్రమాదం జరిగిందని, పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

సింహాచలంలో(Simhachalam) గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

మృతులకు నా ప్రగాఢ సానుభూతి – దేవాదాయ శాఖ మంత్రి ఆనం

సింహాచలంలో(Simhachalam) జరిగిన ఘోర ప్రమాదంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడకూలి ఏనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అంబులెన్సులు రంగంలోకి దిగాయని, కలెక్టర్, హోం మంత్రి అనిత, సహచర మంత్రులు కూడ తక్షణమే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంతంలో బలమైన రక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. గాయపడిన వారికీ తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

నిజరూపంలో దర్శనమిస్తున్న సింహాద్రి అప్పన్న

చందనోత్సవం సందర్భంగా సింహాచలంలో(Simhachalam) వెలసియున్నశ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరుచేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, తితిదే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రొటోకాల్‌, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు.

Also Read : Pawan Kalyan: పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి – పవన్‌ కళ్యాణ్‌

Leave A Reply

Your Email Id will not be published!