BSF: మరో పెద్ద ఉగ్రదాడిని అడ్డుకున్న బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు

మరో పెద్ద ఉగ్రదాడిని అడ్డుకున్న బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు

BSF : జమ్మూ కాశ్మీర్ లో పహాల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్ యొక్క కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారత్ ను ప్రత్యక్షంగా ఏమీ చేయలేక… ఉగ్రదాడులతో పరోక్షంగా దెబ్బతీయాలని చూస్తున్న పాకిస్తాన్ కుట్రలను భద్రతా బలగాలు తిప్పుకొడుతున్నాయి. పహాల్గాం ఉగ్రదాడి ఘటన తరువాత పాకిస్తాన్ సరిహాద్దుల్లో ఉగ్రవాదుల స్థావరాలను, ఇళ్ళను కూల్చివేయడంతో పాటు ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచింది. ఈ నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‐ పంజాబ్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో మరో ఉగ్రదాడి గుట్టు రట్టైంది. పంజాబ్ రాష్ట్రం అమృత్‌ సర్‌లోని భరోపాల్ గ్రామంలో ఓ ఉగ్రమూక బాగోతం బట్టబయలైంది. దుండగులు ఆయుధాల అక్రమ రవాణాకు ఉపక్రమిస్తోన్న తరుణంలో బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు చాకచక్యంగా ఉగ్రమూక ఉనికిని పసిగట్టి పెద్ద ముప్పును తప్పించారు.

BSF , Punjab Police…

బీఎస్‌ఎఫ్ ఇంటిలిజెన్స్ వింగ్ సమాచారం మేరకు ఏప్రిల్ 30 సాయంత్రం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), పంజాబ్ పోలీసుల సంయుక్తంగా అమృత్‌సర్ జిల్లాలోని సభరోపాల్ గ్రామంలో ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లతో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. భరోపాల్ గ్రామం సమీపంలో ఈ ఆపరేషన్ జరిగింది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఆరు మ్యాగజైన్‌లతో మూడు పిస్టళ్లు ఇంకా 50 లైవ్ రౌండ్లు ఉన్నాయి.

“పంజాబ్ పోలీసులతో వేగంగా సమన్వయం చేసుకోవడం వల్లే ఒక పెద్ద ఉగ్రవాద ఘటన జరగకుండా నిరోధించాం” అని BSF అధికారి తెలిపారు. గత వారం రోజుల్లో భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భారీగా పట్టుబడ్డ ఆయుధాలు, పేలుడు పదార్థాల రికవరీలలో ఇది ఒకటి. కొన్ని రోజుల క్రితం, అమృత్‌సర్‌లోని సహోవాల్ గ్రామంలో ఇలాంటి ఉమ్మడి ఆపరేషన్‌లో ఐదు హ్యాండ్ గ్రెనేడ్‌లు, 4.50 కిలోల ఆర్‌డిఎక్స్, నాలుగు పిస్టళ్లు, 220 రౌండ్లు, రెండు రిమోట్ కంట్రోల్‌లు, బ్యాటరీ ఛార్జర్ స్వాధీనం చేసుకున్నారు.

BSF – బంగ్లా సరిహాద్దుల్లో అలజడి రేపుతోన్న పాక్ ఐఎస్ఐ

ఇదిలాఉంటే… బంగ్లా సరిహద్దులో కూడా పాక్ ఐఎస్‌ఐ కలకలం సృష్టించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో మహమ్మద్‌ యూనస్‌ అధికారంలోకి వచ్చాక… ఢాకా-ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయి. దీంతో పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్‌లోని భారత్‌ సరిహద్దుల వైపునకు రావడం పెరిగింది. ఆ దేశంలోని ర్యాడికల్‌ గ్రూప్స్‌తో కూడా పాక్‌ సంబంధాలు పెట్టుకొంటోంది. ఈ నేపథ్యంలో బంగ్లా-భారత ర్యాడికల్‌ గ్రూపులను పాకిస్థాన్‌ వాడుకొనే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఈనేపథ్యంలో భద్రతా ఏజెన్సీలు బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని ముర్షిదాబాద్‌ వంటి ప్రాంతాల్లోని పోస్టులపై దృష్టిపెట్టాయి.

Also Read : Election Commission: జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

Leave A Reply

Your Email Id will not be published!