Deputy CM Pawan Kalyan: ఉపాధి హామీ శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి
ఉపాధి హామీ శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి
Pawan Kalyan : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకం శ్రామికులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరిలోని సి.కె.కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ శ్రామికుల సాధకబాధకాలను డిప్యూటీ సీఎం పవన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకం రాష్ట్రం, దేశానికి ఒక వరమని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారిందన్నారు. సుమారు 75 లక్షల 23 వేల మంది శ్రామికులు సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.10,669 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేవలం వేతనాలకే రూ.6,194 కోట్ల వ్యయం అయిందని వివరించారు. మెటీరియల్ కింద రూ.4,023 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
Deputy CM Pawan Kalyan Good News to..
ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులను ఉద్దేశ్యించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ… ‘‘పల్లె పండుగలో భాగంగా ఇప్పటికి రూ.377.37 కోట్లతో 21,564 గోకులాలు పూర్తి చేశాం. దీని వల్ల ప్రతి రైతుకు నెలకు రూ.4,200 అదనపు ఆదాయం వస్తోంది. రక్తం ధారపోసి పనిచేసేవారు లేకపోతే ఏ నిర్మాణం జరగదు. ఉపాధి కూలీలను… ఉపాధి శ్రామికులుగా పిలుద్దాం. మిగతా వృత్తుల్లో ఉన్నవారిలాగే ఉపాధి శ్రామికులు కూడా గొప్పవారే. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ను అప్పుల పాలు చేసారు. మద్య నిషేధమంటూ వచ్చి గత ప్రభుత్వం వ్యాపారం చేసింది. మద్యం కుంభకోణానికి పాల్పడి రూ.3,200 కోట్లు కొల్లగొట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయ్యాయి’’ అని పవన్ కళ్యాణ్ వివరించారు.
ఉపాధి హామీ శ్రామికులకు భీమా సౌకర్యం
రాష్ట్రంలో ఉపాధి హామీ శ్రామికులకు ప్రధానమంత్రి జీవిత బీమా కల్పించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల జీవిత బీమా లభిస్తుందన్నారు. పని ప్రదేశంలో ప్రమాదం జరిగితే వచ్చే పరిహారాన్ని రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఈ మేరకు పవన్ సమక్షంలో ఎస్‌బీఐతో పంచాయతీరాజ్ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.
Also Read : Raj Kasereddy: లిక్కర్ స్కాం సూత్రదారి రాజ్ కెసిరెడ్డి పీఏను అరెస్ట్ చేసిన సిట్