Visakhapatnam Police: దువ్వాడ జంట హత్యల కేసును చేధించిన పోలీసులు !

దువ్వాడ జంట హత్యల కేసును చేధించిన పోలీసులు !

Visakhapatnam Police : విశాఖ నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. ఈ వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలతో పాటు వివాహేతర సంబంధం కారణంతో యోగేంద్ర బాబు, లక్ష్మీలను నిందితుడు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు విశాఖ నగర పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ(Visakhapatnam) సీపీ శంఖబ్రత బాగ్చి కేసు వివరాలు వెల్లడించారు.

Visakhapatnam Police Chase

విశాఖ(Visakhapatnam) సీపీ శంఖబ్రత బాగ్చి కథనం ప్రకారం… నిందితుడు ప్రసన్న కుమార్‌ మిశ్రా… తన పొరుగున ఉండే యోగేంద్ర, లక్ష్మీ కుటుంబంతో గత కొన్ని సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటూఉండేవాడు. ఈ నేపథ్యంలో లక్ష్మీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కోవిడ్ సమయంలో తన భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న ప్రసన్న కుమార్ మిశ్రా… యోగేంద్ర కుటుంబంతో నమ్మకంటూ వారి వద్ద ఐదు లక్షల రూపాయలు అప్పుచేసాడు. ఇటీవల డబ్బు చెల్లించాలని యోగేంద్ర ఒత్తిడి తేవడంతో పాటు లక్ష్మి కూడా అతనికి దూరంగా ఉంటోంది. దీనితో ఎలాగైనా వారిని అంతమొందించాలని ప్రసన్నకుమార్ మిశ్రా ప్లాన్ చేసాడు.

ఈ నేపథ్యంలో యోగేంద్ర దంపతులు ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య పథకాన్ని ప్రసన్న కుమార్ మిశ్రా అమలు చేశాడు. యోగేంద్ర ఇంట్లో చొరబడి ఇద్దరినీ దారుణంగా హత్యచేసాడు. అనంతరం లక్ష్మి మృతదేహం నుండి 4.5 తులాల బంగారు ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు. దొంగలించిన సొత్తును పూరీలో అమ్మి సొమ్ము చేసుకొన్న జల్సా చేసాడు. అయితే జంట హత్యలు నగరంలో సంచలనం సృష్టించడంతో… ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశాఖ పోలీసులు… కేసు చేదించడానికి పది బృందాలు నియమించారు. ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.

ఈ సందర్భంగా విశాఖ సీపీ(CP) శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ… నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా ఒరిస్సా రాష్ట్రం పూరీకి చెందినవాడు. 2012 లో దుబాయిలో ఓ జ్యువెలరీ షాప్ లో పని చేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అక్కడ 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో యోగేంద్ర కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ అతని భార్య లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు ఐదు లక్షల రూపాయలు అప్పు చేసాడు. అప్పు తీర్చమని యోగేంద్ర కుటుంబం ఒత్తిడి తీసుకురావడంతో…. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడు వద్ద నుండి నాలుగు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.

Also Read : Minister Kondapalli Srinivas: అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు రెండు కళ్ళు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

Leave A Reply

Your Email Id will not be published!