Missile Attack: ఇజ్రాయెల్‌ ఎయిర్ పోర్టుపై పై క్షిపణి దాడి ! ఢిల్లీ- టెల్‌ అవీవ్‌ విమానం అబుదాబీకి మళ్లింపు !

ఇజ్రాయెల్‌ ఎయిర్ పోర్టుపై పై క్షిపణి దాడి ! ఢిల్లీ- టెల్‌ అవీవ్‌ విమానం అబుదాబీకి మళ్లింపు !

 

 

పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఇజ్రాయెల్‌ పై దాడి చేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు… టెల్ అవీవ్ విమానాశ్రయంపై హైపర్‌ సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. దీనితో టెల్ అవీవ్‌ విమానాశ్రయం సమీపంలో దట్టమైన పొగ కమ్ముకుంది. క్షిపణి దాడితో ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు ఒక్కసారిగా కేకలు వేస్తూ పరుగులు తీసారు. మిస్సైల్ అటాక్ కారణంగా టెల్ అవీవ్ టెర్మినల్ 3 పార్కింగ్ స్థలం సమీపంలో పది మీటర్ల మేర పెద్ద గుంత ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ పారామెడిక్ సర్వీస్ సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. దీనితో ఇజ్రాయెల్ లోని ప్రధాన విమానాశ్రయమైన టెల్ అవీవ్‌ కు విమాన రాకపోకలు పాక్షికంగా మూసివేయబడ్డాయని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ మిస్సైల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రతిజ్ఞ చేశారు. ఎవరైతే మాకు హాని చేస్తారో, మేము వారికి ఏడు రెట్లు హాని చేస్తామని ఆయన అన్నారు.

టెల్ అవీవ్ ఎయిర్ పోర్టుపై జరిగిన మిస్సైల్ దాడితో ఎయిర్ ఇండియా సంస్థ అప్రమత్తమైంది. దాడి జరిగిన తరువాత అదే ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని అబుదాబికి మళ్లించారు. అంతేకాదు, ఢిల్లీ – టెల్ అవీవ్ మధ్య విమాన సర్వీసుల్ని మే 6 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కాగా, ఎయిర్ ఇండియా విమానం AI139 టెల్ అవీవ్‌ లో ల్యాండ్ కావడానికి గంటలోపే క్షిపణి దాడి జరగడం విశేషం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24.com లోని సమాచారం ప్రకారం, విమానం అబుదాబికి మళ్లించే సమయంలో ఫ్లైట్ జోర్డాన్ గగనతలంలో ఉంది. ఎయిర్ ఇండియా సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియా విమానం అబుదాబిలో సాధారణంగా ల్యాండ్ అయిందని, త్వరలో ఢిల్లీకి తిరిగి వస్తుందని తెలిపింది.

టెల్‌ అవీవ్‌కు ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు

“ఈ ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయంలో జరిగిన ఘటన తర్వాత ఢిల్లీ నుండి టెల్ అవీవ్‌కు 4 మే 2025న బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI139ని అబుదాబికి మళ్లించారు. విమానం సాధారణంగా అబుదాబిలో ల్యాండ్ అయింది. త్వరలో ఢిల్లీకి తిరిగి వస్తుంది” అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఢిల్లీ – టెల్ అవీవ్ మధ్య విమానాన్ని మే 6 వరకు నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. “మా కస్టమర్లు, సిబ్బంది భద్రత దృష్యా టెల్ అవీవ్‌ కు విమాన సర్వీసులు ఇప్పటి నుంచి 2025 మే 6 వరకు నిలిపివేయబడతాయి. క్షేత్రస్థాయిలో ఉన్న మా సిబ్బంది కస్టమర్లకు సహాయం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వారికి సహాయం అందిస్తున్నారు” అని ఎయిరిండియా ప్రతినిధి చెప్పారు. మే 4 నుంచి 6 మధ్య ప్రయాణాలకు టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి పూర్తి మొత్తాన్ని రిఫండ్‌ చేస్తామని ‘ఎక్స్‌’లో పేర్కొంది. ఇతర సమాచారం కోసం 011-69329333, 011-69329999 నంబర్లు లేదా తమ అధికారిక వెబ్‌సైట్‌ airindia.comను సంప్రదించవచ్చని సూచించింది.

 

 

Leave A Reply

Your Email Id will not be published!