Kohinoor Diamond: కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇవ్వడంపై బ్రిటన్ మంత్రి ఆశక్తికరమైన వ్యాఖ్యలు
కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇవ్వడంపై బ్రిటన్ మంత్రి ఆశక్తికరమైన వ్యాఖ్యలు
బ్రిటన్ మహారాణి కిరిటంలో పొదివి ఉన్న కోహినూర్ వజ్రం విశిష్ఠత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ కు చెందిన 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని 1849లో మహారాజ్ దులీప్ సింగ్… విక్టోరియా మహారాణికి బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ వజ్రం వారి ఆధీనంలోనే ఉంది. దీనితో బ్రిటన్ మహారాణి కిరీటంలో అమర్చారు. అయితే, దానిని తిరిగి తీసుకోవాలని భారత ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ప్రయత్నించినప్పటికీ… అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవల అమెరికాతో దౌత్య సంబంధాలు మెరుగుపడటంతో ముంబై ఉగ్రదాడి సూత్రదారి తహవ్వూర్ రాణాను… భారత్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని కూడా భారత్ కు తిరిగి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది.
ఇటీవల భారత్, బ్రిటన్ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడటంతో… బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రి లీసా నాండీ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ అధికార పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… కోహినూర్ వజ్రాన్ని భారత్ కు అప్పగించడంపై మంత్రి లీసా నాండీ ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్ కు ఇచ్చేస్తారా ? అన్న ప్రశ్నకు… భారత్, బ్రిటన్ మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు మంత్రి లీసా నాండీ చెప్పారు. అన్నీ సానుకూలంగా జరిగితే… అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావొచ్చంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై భారత్ సాంస్కృతిక శాఖ మంత్రితోనూ చర్చించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి లీసా నాండీ మాట్లాడుతూ… సృజనాత్మకత, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో భారత్‌లో దృఢమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు లీసా తెలిపారు. ‘‘ సినిమా, టీవీ, మ్యూజిక్, క్రీడా రంగాల్లో బ్రిటన్ దూసుకుపోతోంది. ఆయా రంగాలకు సంబంధించిన బ్రిటన్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. భారత్ సహకరిస్తే.. వాటిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ల వచ్చన్న గట్టి నమ్మకం మాకుంది. అందుకు భారత్ కూడా మద్దతిస్తుందని ఆశిస్తున్నాం’’ అని లీసా తెలిపారు. భారత్ పర్యటన కోసం శుక్రవారం దిల్లీ చేరుకున్న ఆమె.. సాంస్కృతిక శాఖకు సంబంధించిన పలు ఒప్పందాల గురించి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడిపైనా ఆమె స్పందించారు. ఈ దారుణఘటనలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, ఉగ్రవాదం నిర్మూలనకు ప్రపంచదేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు.