Telangana Police: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు
ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్స్ పై ఉన్న ప్రకటనలపై పలువురు పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన ఆరోపణలు చేసారు. అన్వేష్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… సైబరాబాద్ పోలీసులు అతనిపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
బెట్టింగ్ యాప్‌లు ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. దీని బారిన పడి పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. ఎంతోమంది తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ యాప్‌లను కొంతమంది సినీ ప్రముఖులు ప్రమోట్ చేశారు. వీరిపై కూడా రేవంత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన వారు ఎంతవారైనా విడిచి పెట్టేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్‌లను హైదరాబాద్ మెట్రోరైలులో ప్రమోట్ చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. అయితే మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం వెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటూ ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఆరోపణలు చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ అన్వేష్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో అక్రమ బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్లు చేస్తున్న వారిపై వరుసగా అన్వేష్ వీడియోలు చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై అన్వేష్ వీడియో చేశారు.
అయితే అన్వేష్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతి కుమారి, ఐఏఎస్‌లు దాన కిషోర్, వికాస్ రాజ్‌లపై అన్వేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అన్వేష్ వీడియోలో పేర్కొన్నారు. ఆవాస్తవంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అన్వేష్ పై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారుల విశ్వాసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలిగించేలా ఈ వీడియో ఉందని కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.