Indian Railways: డిజిటల్ క్లాక్ డిజైన్ పై ఇండియన్ రైల్వే పోటీ ! రూ.5 లక్షల ప్రైజ్ మనీ !
డిజిటల్ క్లాక్ డిజైన్ పై ఇండియన్ రైల్వే పోటీ ! రూ.5 లక్షల ప్రైజ్ మనీ !
Indian Railways : దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో కొత్త డిజిటల్ గడియారాలను రూపొందించడానికి ఇండియన్ రేల్వే(Indian Railways) దేశవ్యాప్తంగా ఒక పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త డిజిటల్ క్లాక్ డిజైన్ కోసం ఔత్సాహికుల నుండి ధరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ డిజిటల్ క్లాక్ డిజైన్ లో పోటీలో పాల్గొనేవారు… తాము డిజైన్ చేసిన డిజిటల్ క్లాక్ ఫోటోను ఇండియన్ రైల్వే ఇచ్చిన వెబ్ సైట్ కు పంపిచాల్సి ఉంటుంది. ఈ పోటీలో గెలుపొందిన వారికి భారీ నగదు బహుమతిని కూడా ఇండియన్ రైల్వే ప్రకటించింది. అయితే ఈ పోటీలో పాల్గొనేవారిని ”ప్రొఫెషనల్స్, కళాశాల/విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు (12వ తరగతి వరకు)” అని మూడు వర్గాలుగా విభజించింది. ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్ లను 2025 మే 1 నుంచి మే 31 మధ్య ఆన్‌లైన్ లో (contest.pr@rb.railnet.gov.in) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రైల్వే ప్లాట్‌ఫామ్ లలో, స్టేషన్ ప్రాంగణాలలో ఉపయోగించే గడియారాలు ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Indian Railways Competition
ఈ డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ గురించి రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ‘దిలీప్ కుమార్’ మాట్లాడుతూ… గెలుపొందిన విజేతకు… మొదటి బహుమతి రూ. 5 లక్షలు అందిస్తామని వెల్లడించారు. అంతే కాకుండా మూడు విభాగాలలో ఐదుమందికి కన్సోలేషన్ బహుమతులుగా రూ. 5000 చొప్పున ఇవ్వనున్నట్లు స్పష్టంగా చేశారు. ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్లను… హై రిజల్యూషన్ లో, ఎలాంటి వాటర్ మార్క్ లేదా లోగో వంటివి లేకుండా, ఒరిజినాలిటీ సర్టిఫికెట్ తో సబ్మిట్ చేయాలని దిలీప్ కుమార్ పేర్కొన్నారు. డిజైన్ వెనుక ఉన్న థీమ్… ఆలోచనను వివరించే కాన్సెప్ట్ నోట్ కూడా ఉండాలి. మీరు సబ్మిట్ చేసే డిజైన్స్ అసలైనవిగా ఉండాలి, వాటిపై ఎలాంటి కాపీరైట్స్ ఉండకూడదని ఆయన వివరించారు.
పాఠశాల విభాగంలో పాల్గొనే విద్యార్థులు స్టూడెంట్ ఐడీ కార్డును సైతం అప్‌లోడ్ చేయాలి. కళాశాల విభాగంలో ప్రస్తుతం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో చేరిన వ్యక్తులు సంబంధిత ఐడీ కార్డును అందించాలి. మిగిలినవారు ప్రొఫెషనల్ కేటగిరీ కిందకు వస్తారని ఆయన అన్నారు.
Also Read : Turkish Warship: కరాచీ తీరానికి తుర్కియే యుద్ధనౌక