Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో హతమైన టాప్ టెర్రరిస్ట్ ల వివరాలు వెల్లడి
ఆపరేషన్ సిందూర్ లో హతమైన టాప్ టెర్రరిస్ట్ ల వివరాలు వెల్లడి
Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి పత్రీకారచర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్(Pakistan) మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ష్కరే తయ్యిబా, జైషే మహ్మమ్మద్ సహా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసింది. ఈ ‘ఆపరేషన్ సిందూర్’ లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇటీవల కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు కీలక ఉగ్ర నాయకులను కూడా మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. వారి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.
Operation Sindoor Updates
‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ లో జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్కరే తయ్యిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లుగా పేర్కొంటూ ఆంగ్ల మీడియాలో ఓ జాబితా బయటికొచ్చింది.
1. ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్
ఇతడు లష్కరే తయ్యిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది. ఇతడి అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలోని జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ (పాక్ లోని) సీఎం, ఐజీ పాల్గొన్నట్లు సమాచారం.
2. హఫీజ్ మహమ్మద్ జమీల్
జైషే మహమ్మద్ ఉగ్ర ముఠాలోని కీలక సభ్యుడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది.
3. మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ అలియాస్ సలీమ్ అలియాస్ సాహబ్
జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది ఇతడు. మసూద్ అజార్ మరో బావమరిది అయిన అజార్.. ఐసీ-814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
4. ఖలీద్ అలియాస్ అబు అకాస
లష్కరే తయ్యిబాకు చెందిన టాప్ ఉగ్రవాది. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు. అఫ్గానిస్థాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేసేవాడు. ఫైసలాబాద్‌లో జరిగిన ఇతడి అంత్యక్రియలకు పాక్‌లోని సీనియర్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సమాచారం.
5. మహమ్మద్ హసన్ ఖాన్
జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు.
జైషే, లష్కరే ముఠాల కీలక స్థావరాలే లక్ష్యంగా భారత్ ఈ మెరుపుదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో.. లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలో గల లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం కూడా ఉంది. ఇక్కడ 26/11 ముంబయి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ తీసుకున్నారు. ఇక, జైషేకు చెందిన ప్రధాన కేంద్రం బహవల్పూర్ లోని మర్కజ్ సుబాన్ పైనా దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబంలోని సుమారు 14 మంది మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి.
Also Read : IMF: పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ రుణం ! షాక్‌కు గురిచేసిందన్న కాంగ్రెస్ !