Minister S Jaishankar: చరిత్రలో తొలిసారిగా తాలిబన్ మంత్రితో జై శంకర్ చర్చలు
చరిత్రలో తొలిసారిగా తాలిబన్ మంత్రితో జై శంకర్ చర్చలు
Minister S Jaishankar : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ ఖాన్ ముత్తాఖీతో… భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఫోన్ లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని జైశంకర్(Minister S Jaishankar) స్వాగతించారు. ఈవిషయాన్ని కేంద్రమంత్రి ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తాలిబన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Minister S Jaishankar Meet
‘‘అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ తో మంచి సంభాషణ జరిగింది. పహల్గాం ఉగ్రదాడిని ఆయన ఖండించడం హర్షణీయం. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇటీవల అవాస్తవ, నిరాధార ప్రచారం జరిగింది. దాన్ని ఆయన తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నా. అఫ్గాన్ ప్రజలతో మా స్నేహబంధాన్ని కొనసాగిస్తాం. వారి అభివృద్ధికి నిరంతర మద్దతు అందిస్తాం. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై మేం చర్చలు జరిపాం’’ అని జైశంకర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే. అయితే, ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ సమయంలో పాక్ సంచలన ఆరోపణలు చేసింది. భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి అఫ్గాన్ భూభాగంలో పడినట్లు తప్పుడు ప్రచారం చేసింది. దీన్ని కాబూల్ ఖండించింది. తమకు ఎలాంటి హాని జరగలేదని, అదంతా అవాస్తవమేనని తాలిబన్ రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. అటు న్యూఢిల్లీ కూడా పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టింది.
2021 ఆగస్టులో అఫ్గాన్‌లో తాలిబన్ పాలన ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించనప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. మరోవైపు, అఫ్గాన్‌లో అల్‌ఖైదా, ఐసిస్, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్రముఠాల ఉనికిపై న్యూదిల్లీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తాలిబన్ మంత్రితో జైశంకర్ చర్చలు జరపడం తాజా పరిస్థితుల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు