Jayant Narlikar: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ నార్లికర్ కన్నుమూత
ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ నార్లికర్ కన్నుమూత
Jayant Narlikar : ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, సైన్స్ కమ్యూనికేషన్ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్(Jayant Narlikar) మహారాష్ట్రలోని పూణేలో మంగళవారం కన్నుమూశారు. భారతదేశంలో ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడంలో నార్లికర్ గణనీయమైన పాత్ర పోషించారు. విశ్వోద్భవ శాస్త్రం, బిగ్ బ్యాంగ్‌కు ప్రత్యామ్నాయ సిద్ధాంతాల రూపకల్పనలో నార్లికర్ విశేష కృషి చేశారు. పూణేలోని ఇంటర్-యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐయూసీఏఏ) వ్యవస్థాపక డైరెక్టర్‌గా పేరొందారు. 1938, జూలై 19న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ ఆయన ఫ్రెడ్ హోయిల్‌తో కలిసి హోయ్ల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ విశ్వోద్భవ నమూనాలను సవాలు చేసింది.
తన శాస్త్రీయ రచనలతో పాటు నార్లికర్(Jayant Narlikar) పలు సంక్లిష్టమైన శాస్త్రీయ భావనలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆయన మరాఠీలో సైన్స్ ఫిక్షన్ కూడా రాశారు. నార్లికర్ రచనలు కొత్త తరాల పరిశోధకులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో నార్లికర్(Jayant Narlikar) చేసిన కృషిగా గాను ఆయన పద్మభూషణ్ (1965), పద్మవిభూషణ్ (2004), మహారాష్ట్ర భూషణ్ (2010) తదితర ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1980ల చివరలో ఆయన ప్రముఖ టీవీ షో ‘కాస్మోస్: ఎ పర్సనల్ వాయేజ్’లో కనిపించారు. ఇది ఖగోళ భౌతిక శాస్త్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపును మరోమారు గుర్తు చేసింది.
డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ ప్రఖ్యాత ఖగోళ, సైన్స్ కమ్యూనికేషన్ శాస్త్రవేత్తగా ప్రసిద్ధి గాంచారు. ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం కూడా లభించింది. భారతీయ విజ్ఞాన శాస్త్రంలో ఒక మహోన్నత వ్యక్తిగా, డాక్టర్ నార్లికర్ ఖగోళ శాస్త్రానికి చేసిన మార్గదర్శక కృషికి, విజ్ఞాన శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థలను స్థాపించడానికి ప్రసిద్ది చెందారు. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం, డాక్టర్ నార్లికర్ మంగళవారం ఉదయం నిద్రలోనే మరణించారు. ఆయన ఇటీవల ఆసుపత్రిలో తుంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Jayant Narlikar – కేంబ్రిడ్జ్ లో నార్లికర్ ఉన్నత విద్య
జూలై 19, 1938న జన్మించిన డాక్టర్ నార్లికర్(Jayant Narlikar) తన ప్రాథమిక విద్యను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) క్యాంపస్‌లో పూర్తి చేశారు. తర్వాత ఉన్నత విద్యను కేంబ్రిడ్జ్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (1972–1989)లో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు. విష్ణు నార్లికర్ నాయకత్వంలో సైద్ధాంతిక ఖగోళ భౌతిక శాస్త్ర సమూహాన్ని విస్తరించారు. ఇది క్రమంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 1988లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డాక్టర్ నార్లికర్‌ను ప్రతిపాదిత ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (IUCAA)ని స్థాపించడానికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆహ్వానించింది.
2003లో పదవీ విరమణ చేసే వరకు ఆయన IUCAA డైరెక్టర్ పదవిలో కొనసాగారు. ఆయన నేతృత్వంలో IUCAA ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రంలో బోధన, పరిశోధనలలో అత్యుత్తమ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సాధించింది. 2012లో థర్డ్ వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డాక్టర్ నార్లికర్‌కు సైన్స్‌లో అత్యుత్తమ కేంద్రాన్ని స్థాపించినందుకు అవార్డును ప్రదానం చేసింది. డాక్టర్ నార్లికర్ తన పుస్తకాలు, వ్యాసాలు, రేడియో, టీవీ కార్యక్రమాల ద్వారా సైన్స్ కమ్యూనికేషన్‌గా ప్రసిద్ధి చెందారు. అతను తన సైన్స్ ఫిక్షన్ కథల ద్వారా కూడా ప్రాముఖ్యత దక్కించుకున్నారు.
మహారాష్ట్ర భూషణ్ అవార్డును ప్రధానం చేసిన ప్రభుత్వం
ఈ ప్రయత్నాలన్నిటికీ గాను ఆయనకు 1996లో యునెస్కో ద్వారా కళింగ అవార్డు లభించింది. ఆ క్రమంలో డాక్టర్ నార్లికర్‌కు 1965లో 26 ఏళ్లకు చిన్న వయసులోనే పద్మభూషణ్ లభించడం విశేషం. 2004లో ఆయనకు పద్మవిభూషణ్ లభించింది. 2011లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్‌ను ప్రదానం చేసింది. 2014లో భారతదేశపు ప్రముఖ సాహిత్య సంస్థ సాహిత్య అకాడమీ, ప్రాంతీయ భాష (మరాఠీ) రచనలో అత్యున్నత పురస్కారానికి ఆయన ఆత్మకథను ఎంపిక చేసింది.
Also Read : Jayant Narlikar: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ నార్లికర్ కన్నుమూత