Beating Retreat: భారత్-పాక్ సరిహాద్దుల్లో నేటి నుంచి ‘బీటింగ్ రీట్రీట్’ పునః ప్రారంభం
భారత్-పాక్ సరిహాద్దుల్లో నేటి నుంచి ‘బీటింగ్ రీట్రీట్’ పునః ప్రారంభం
Beating Retreat : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దులో పాకిస్థాన్ సైనికులతో ‘బీటింగ్ రీట్రీట్’ నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్ లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దులోని మూడు చెక్‌పోస్టులు – అటారీ-వాఘా (అమృత్‌సర్), హుస్సేన్‌వాలా (ఫిరోజ్‌పుర్), సద్కి (ఫజిల్కా) వద్ద ‘బీటింగ్ రీట్రీట్(Beating Retreat)’ వేడుకలు నేటినుంచి తిరిగి ప్రారంభమవుతాయని బీఎస్‌ఎఫ్ (BSF) అధికారులు తెలిపారు. అయితే దీనిపై పలు ఆంక్షలు విధించారు. జెండా అవనతం ప్రక్రియ సమయంలో బార్డర్ గేట్లను తెరవబోమని… బీఎస్‌ఎఫ్ దళాలు పాక్ రేంజర్లతో కరచాలనం చేయవని చెప్పారు. ఈ కార్యక్రమం సమయాన్ని కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. తొలిరోజు మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని… రేపటి నుంచి సాధారణ పౌరులందరికీ అనుమతి ఉంటుందని తెలిపారు. మే 8 నుంచి సైనిక దళాలు ప్రతిరోజూ జెండాను అవనతం చేస్తున్నాయని … కానీ ప్రజల భద్రత దృష్ట్యా బీటింగ్ రీట్రీట్, ప్రజలకు ప్రవేశం వంటివాటిని నిలిపివేశామని అన్నారు.
Beating Retreat Will Restart
1959 నుంచి దేశ సరిహద్దుల్లో భారత్-పాక్ సైనికులకు మధ్య బీటింగ్ రీట్రీట్ జరుగుతోంది. ప్రతిరోజూ సాయంత్రం ఇరుదేశాల సైనికులు సంయుక్తంగా దీనిని నిర్వహిస్తారు. ఈ కసరత్తులో సైనికులు వివిధ విన్యాసాలు చేస్తారు. తరువాత ఇరుదేశాల జెండాలను అవనతం చేస్తారు. రెండు దళాల కమాండర్ల మధ్య కరచాలనంతో ఇది ముగుస్తుంది. ఈ కార్యక్రమాన్ని సందర్శించడానికి ప్రతిరోజు సరిహద్దు గ్రామాల ప్రజలు, పర్యాటకులు భారీగా హాజరవుతుంటారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై పలు దౌత్య చర్యలను తీసుకున్న భారత్ సరిహద్దుల్లో బీటింగ్ రీట్రీట్ వేడుకనూ నిలిపివేసింది. గతంలో 2014 వాఘా వద్ద ఆత్మాహుతి బాంబు దాడి, 2019లో పుల్వామా దాడి తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
Also Read : Khalistan Terrorists: పంజాబ్‌లో ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు