Rahul Gandhi: జీఎస్టీతో ఆర్థిక అన్యాయం – విపక్షనేత రాహుల్ గాంధీ
జీఎస్టీతో ఆర్థిక అన్యాయం - విపక్షనేత రాహుల్ గాంధీ
Rahul Gandhi : ఎనిమిదేళ్లు పూర్తిచేసుకొన్న జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) పన్ను విధానం ఆర్థిక అన్యాయాన్ని, కార్పొరేట్ ఆశ్రిత పక్షపాతాన్ని పెంచి పోషిస్తున్న క్రూరమైన సాధనమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. ప్రజలకు తొలి ప్రాధాన్యమిస్తూ వ్యాపారులకు స్నేహపూర్వకంగా, సిసలైన సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావాలంటూ మంగళవారం ‘ఎక్స్’ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Rahul Gandhi Shocking Comments on GST
‘‘చిన్న దుకాణదారు నుంచి రైతు వరకు ప్రతి భారతీయుడు దేశ పురోగతిలో భాగస్వామిగా ఉండేలా భారత్‌కు సార్వజనీక పన్ను విధానం అవసరం. మోదీ సర్కారు గత ఎనిమిదేళ్లుగా అమలుచేస్తున్న జీఎస్టీ పేదలను శిక్షించడానికి, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మూసివేతకు, రాష్ట్రాలను అణగదొక్కి.. ప్రధానికి ఉన్న కొద్దిమంది బిలియనీర్ మిత్రులు లబ్ధి పొందడానికి ఉపయోగపడుతోంది’’ అని రాహుల్ మండిపడ్డారు.
భారత్ లో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గత ఎనిమిదేళ్లలో 18 లక్షలకు పైగా మూతపడ్డాయన్నారు. ‘‘ఈ దేశ పౌరులు చాయ్ మొదలు ఆరోగ్యబీమా దాకా అన్నిటికీ జీఎస్టీ కడుతుండగా, కార్పొరేట్లు ఏటా రూ.లక్ష కోట్లకు పైగా పన్ను మినహాయింపులు పొందుతున్నారు. జీఎస్టీ బకాయిలను ఆయుధంగా మార్చుకొని భాజపాయేతర పాలిత రాష్ట్రాలను కేంద్రం శిక్షిస్తోంది. ఇది మోదీ ప్రభుత్వ సమాఖ్య వ్యతిరేక అజెండాకు నిదర్శనం. భారతదేశ మార్కెట్లను ఏకం చేయడానికి, పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడానికి తీసుకొచ్చిన జీఎస్టీ యూపీఏ సర్కారు చేసిన దార్శనిక ఆలోచన. పేలవమైన అమలు, రాజకీయ పక్షపాతంతో దీన్ని పక్కదోవ పట్టించారు’’ అని రాహుల్ ధ్వజమెత్తారు.
Also Read : Terrorists: రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
