Shashi Tharoor: కాంగ్రెస్ నేత శశిథరూర్ పై స్వంత పార్టీ నేతల అసంతృప్తి
కాంగ్రెస్ నేత శశిథరూర్ పై స్వంత పార్టీ నేతల అసంతృప్తి
Shashi Tharoor : కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యవహార శైలిపై సొంత పార్టీలో… అదీ సొంత రాష్ట్రంలోనే తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఆయన్ను తమలో ఒకరిగా పరిగణించడం లేదంటూ తాజాగా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కే మురళీధరన్ వ్యాఖ్యానించారు. దేశ భద్రత అంశంపై థరూర్ తన వైఖరిని మార్చుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించేది లేదని స్పష్టం చేసారు.
పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని శశిథరూర్ వ్యాఖ్యానించిన వేళ… కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత కే మురళీధరన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘శశిథరూర్ (Shashi Tharoor) తన తీరును మార్చుకునే వరకు… తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోం. ఆయన మాతో కలిసి లేరు. కాబట్టి.. ఆయన్ను బహిష్కరించే ప్రశ్నే పుట్టదు. అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది’’ అని మురళీధరన్ అన్నారు.
ఇదిలా ఉంటే… మురళీధరన్… శశిథరూర్‌పై (Shashi Tharoor) మండిపడ్డడం ఇదే తొలికాదు. ఎమర్జెన్సీ రోజులపై థరూర్ రాసిన వ్యాసంపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఆయనకు(శశిథరూర్ పేరును ప్రస్తావించకుండా) ఏమైనా ఆంక్షలు ఉన్నట్లు అనిపిస్తే.. స్పష్టమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇంకోవైపు కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా శశిథరూర్ వైపే మొగ్గు ఉందంటూ ఓ సర్వేకు సంబంధించిన పోస్టుపైన మురళీధరన్ గతంలో విరుచుకుపడ్డారు. ఆయన ఏ పార్టీకి చెందినవారో ముందుగా నిర్ణయించుకోవాలన్నారు.
గత కొంతకాలంగా శశిథరూర్‌కు కాంగ్రెస్ అధిష్టానాకి మధ్య పొసగడం లేదు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి శశిథరూర్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరేమనుకున్నా తాను బీజేపీలో చేరేది లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ థరూర్ చెబుతూ వస్తున్నారు.
Shashi Tharoor – పార్టీ ప్రయోజనాలకంటే దేశమే ముఖ్యం – శశిథరూర్
పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) పేర్కొన్నారు. కొచ్చిలోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సొంత పార్టీలో వ్యతిరేకత రావడంపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. జాతీయ ఐక్యతకు రాజకీయ వైరాలు అడ్డుకాకూడదన్నారు. ‘‘దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు మీ విధానాలను పక్కన పెట్టాలి. దేశమే గుర్తుండాలి. అప్పుడే మనమంతా జీవించగలం. నా దృష్టిలో దేశమే ముందు. మీరు ఏ పార్టీకి చెందినవారైనా సరే. ఆ పార్టీ లక్ష్యం మెరుగైన భారతదేశాన్ని సృష్టించడమే అవ్వాలి. సోషలిజం, స్వేచ్ఛ, నియంత్రణ వంటి భావజాలాలతో పార్టీలు భిన్నంగా ఉండవచ్చు. అయితే, సురక్షితమైన భారత్‌కు అవన్నీ కట్టుబడి ఉండాలి. జాతీయ భద్రతకు సంబంధించిన విషయం వస్తే అన్ని పార్టీలూ సహకరించుకోవాలి. మన సాయుధ దళాలకు, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో నేను తీసుకున్న వైఖరి కారణంగా కొందరు నాపై విమర్శలు చేశారు. కానీ, నేను చేసింది సరైందని నమ్మి.. నిలబడ్డా’’ అని థరూర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. స్పందించేందుకు థరూర్ నిరాకరించారు.
Also Read : Malaria Vaccine: త్వరలో మార్కెట్ లోనికి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్
