Manasa Devi Temple: మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట ! ఆరుగురు భక్తులు మృతి !
మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట ! ఆరుగురు భక్తులు మృతి !
Manasa Devi Temple : ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లోగల మానసా దేవి ఆలయం (Manasa Devi Temple) సమీపంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా మరో 25 మంది గాయాలపాలయ్యారు. గాయపడ్డవారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుండగా కొందరిని రిషికేశ్ ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. శ్రావణమాసం అందులోనూ ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జులై 23వ తేదీన మాస శివరాత్రి జలాభిషేకం తర్వాత, లక్షలాది మంది కన్వర్ యాత్రికులు, సామాన్య ప్రజలు ఇప్పటికే హరిద్వార్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడి చేరుకోవడంతో… ఆలయంలో తొక్కిసలాట జరిగింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది.
Manasa Devi Temple Stampede
మరోవైపు.. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రగాఢ సానుభూతి తెలిపారు. “హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయ మార్గంలో జరిగిన తొక్కిసలాట బాధాకరం. స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నాను. భక్తుల భద్రత కోసం మాతృదేవతను ప్రార్థిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఇక, శివాలిక్ కొండలపై 500 అడుగుల ఎత్తులో ఉన్న మానసాదేవి ఆలయం (Manasa Devi Temple), హరిద్వార్‌లోని పంచ తీర్థాలలో ఒకటి. ఇది పాముల దేవత మా మానసా దేవి ఆలయం, పురాతన సిద్ధపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (CM Pushkar Singh Dhami) హరిద్వార్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే చేశామని, బాధిత కుటుంబాలకు సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని, ఈ విషాద ఘటనలో బాధితులకు, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు మానసా దేవి ఆలయ (Manasa Devi Temple) ట్రస్ట్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా అదే మొత్తంలో ఎక్స్ గ్రేషియా పరిహారాన్ని ప్రకటించింది. అంతేకాదు ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ లో ఒక పోస్ట్‌లో రాష్ట్రపతి ముర్ము ‘హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో అనేక మంది భక్తులు మరణించిన వార్త చాలా బాధాకరం. దుఃఖంలో ఉన్న అన్ని కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.
తొక్కిసలాట ఘటనపై డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (డీఎం) మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ… “విద్యుత్ తీగ తెగిపోయిందనే పుకారును ఎవరో వ్యాప్తి చేశారని ఫోటోలు, వీడియోల ద్వారా తెలిసింది. గాయపడిన వారు, మృతులు విద్యుత్ షాక్‌కు గురైనట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ పుకారును ఎవరు వ్యాప్తి చేశారనే దానిపై దర్యాప్తు చేస్తాం. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం. సీసీటీవీ కెమెరాలు, ఇతర మార్గాలను పరిశీలిస్తాం. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు” అని తెలిపారు.
Also Read : Sansad Ratna Awards 2025: 17 మంది ఎంపీలకు సంసద్‌రత్న-2025 అవార్డులు
