CM Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు నో చెప్పిన విప్రో చైర్మెన్ ప్రేమ్‌జీ

సీఎం సిద్ధరామయ్యకు నో చెప్పిన విప్రో చైర్మెన్ ప్రేమ్‌జీ

CM Siddaramaiah : బెంగళూరు ఓఆర్ఆర్ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా విప్రో క్యాంపస్ మీదుగా వాహనాలను అనుమతించాలన్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య (CM Siddaramaiah) అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయితే, తమ క్యాంపస్ మీదుగా ట్రాఫిక్‌ను అనుమతించడం సాధ్యం కాదంటూ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అశక్తత వ్యక్తం చేశారు. ప్రత్యేక ఆర్థిక జోన్‌లోని ఈ క్యాంపస్‌లో అంతర్జాతీయ క్లైంట్స్‌కు సేవలందిస్తుంటామని వెల్లడించారు. క్యాంపస్‌లోకి సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించడం ఈ సమస్యకు సుస్థిర దీర్ఘకాలిక పరిష్కారం కాజాలదని కూడా పేర్కొన్నారు.

CM Siddaramaiah Comments

అయితే, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు విప్రో చైర్మన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. డాటా ఆధారిత పరిష్కారాల కోసం కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. అమలుకు సాధ్యమైన పరిష్కారాలు చూపించేందుకు అర్బన్ రవాణా రంగ నిర్వహణ నిపుణులతో ఓ సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కూడా సూచించారు.

కర్ణాటక (Karnataka) అభివృద్ధిలో విప్రో పాత్రను గుర్తించినందుకు సీఎం సిద్దరామయ్యకు (CM Siddaramaiah) ప్రేమ్‌జీ ధన్యవాదాలు తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్ సమస్యలను తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇది సంక్లిష్ట సమస్య అని, ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఒక్క పరిష్కారంతో చిక్కులను తొలగించలేమని అన్నారు. ట్రాఫిక్ సమస్యపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనంతో పరిష్కారాలపై అవగాహన వస్తుందని అన్నారు. ఈ అధ్యయనానికి అయ్యే ఖర్చులో కొంత భరించేందుకు తాము సిద్ధమేనంటూ కర్ణాటక సీఎంకు అజీమ్ ప్రేమ్‌జీ లేఖ రాశారు.

కులగణన సర్వేలో పాల్గొనడం ఐచ్ఛికమే – కర్ణాటక హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణ సర్వేపై స్టే విధించలేమని కర్ణాటక (Karnataka) హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, సర్వేలో పాల్గొనడం ప్రజల ఐచ్ఛికమేనని పేర్కొంది. ఇదేమీ తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేయాలనీ పేర్కొంది. అన్ని వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలంటూ సర్వేయర్లు ప్రజలను బలవంతం చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ సర్వేలో సేకరించిన వివరాలను జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపింది. కమిషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌కు మాత్రమే ఈ వివరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కులగణన చేపడుతున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలైన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపించారు. సర్వే చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పిటిషనర్లు ప్రశ్నించడం లేదని అన్నారు. కేవలం సర్వే జరుగుతున్న తీరుపైనే పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక సర్వే విధానంలో ఏకరమైన తప్పులు ఉన్నాయో పిటిషనర్లు వివరించనందున ఈ దశలో స్టే అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. వెనుకబడిన తరగతుల ప్రయోజనార్థం చేపడుతున్న సర్వే ప్రజల హక్కులను ఉల్లంఘించట్లేదని పేర్కొంది.

ఇక ప్రజలు సర్వేలో పాల్గొనకుండా తిరస్కరించే అవకాశాన్ని సర్వే హ్యాండ్‌ బుక్‌లో ఎందుకు పేర్కొనలేదని హైకోర్టు బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్‌ను ప్రశ్నించింది. ప్రతి ఇంటిని సర్వే చేయాలని సర్వేయర్లకు మార్గదర్శకాలు ఉన్న విషయాన్ని కూడా పేర్కొంది. దీనిపై కమిషన్ తరఫు న్యాయవాది స్పందించారు. ప్రజలు తమకు సమాచారం ఇవ్వలేదని రికార్డు చేసుకునేందుకు సర్వేయర్లను అనుమతించిన విషయాన్ని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన సమాచారాన్నే రికార్డు చేసుకోవాలని ఎన్యూమరేటర్లకు చెప్పినట్టు వివరించారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులతోనూ చర్చలు జరిపామని అన్నారు. ఈ సందర్భంగా ఆధార్ నెంబర్‌లు సేకరించడంపైనా హైకోర్టు కమిషన్‌ను ప్రశ్నించింది. అయితే, ప్రజల నుంచి సేకరించిన నెంబర్లు, అందరికీ అందుబాటులో ఉండవని, కాబట్టి దుర్వినియోగమయ్యే ముప్పు లేదని భరోసా ఇచ్చింది.

Also Read : HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో రూ 62వేల కోట్ల ఒప్పందం

Leave A Reply

Your Email Id will not be published!