హైదరాబాద్ : తమ ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో జరగనున్న క్రీడా పోటీలకు సంబంధించి చీఫ్ మినిస్టర్స్ కప్ 2వ ఎడిషన్ -2025 పోస్టర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ క్రీడా పోటీలకు సంబంధించి అవగాహన కల్పించడానికి ఈ నెల 8వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు పది రోజుల వరకు టార్చ్ ర్యాలీ కొనసాగనుంది.
ఆ తర్వాత ఈ నెల 17 వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వ తేదీ వరకు మండల స్థాయి,లో పోటీలు జరుగుతాయని ఈ సందర్బంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. వీటితో పాటు ఫిబ్రవరి 3 నుంచి 7 తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయని తెలిపారు. డిసెంబర్ నెలలో జరగాల్సిన ఈ క్రీడలు వివిధ కారణాలతో వాయిదా పడ్డాయని పేర్కొన్నారు.
గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు శాట్స్ చైర్మన్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన శివ సేనా రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ , సిఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు , శాట్స్ ఎండీ సోనీబాల పాల్గొన్నారు.
