విజయవాడ : రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఆపై దాడులకు తెగ బడుతున్నారని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని, ఈసీ నిద్ర పోతోందని ఆరోపించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు జగన్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య ఉల్లంఘనలు, 8 మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు కాని పరిస్థితి, పలుచోట్ల నామినేషన్ పత్రాలను చింపి వేయడం, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకోవడం, అక్రమ కేసులు పెట్టడం వంటి అంశాలను వివరించడంతో పాటు, పోలీసు వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి పై హత్యాయత్నం, ఎంపీ అవినాష్ రెడ్డి , గురుమూర్తిలపై కేసులు కూడా ప్రస్తావించారు ఈ సందర్బంగా జగన్ రెడ్డి. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లో లేదా కేంద్రీకృత విధానంలో నిర్వహించాలని, పోలింగ్ బూత్‌లు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేయాలని, 17సీ ఫారాల పరిశీలనలోనూ పారదర్శకత పాటించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ ను కలిసిన అనంతరం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇంతటి దారుణమైన అప్రజాస్వామ్య పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండదన్నారు. అప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియపై గవర్నర్‌కి ఆధారాలతో సుదీర్ఘంగా వివరించామని తెలిపారు. 8 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్, చైర్మన్ పదవులకు అసలు నామినేషన్లే దాఖలు చేయని పరిస్తితి నెలకొందన్నారు. ఇదేం పద్దతి అంటూ ప్రశ్నించారు. ఏడు చోట్ల పూర్తిగా జీరో నామినేషన్లు.. ఇంకో చోట కేవలం 3 నామినేషన్లు మాత్రమే పడ్డాయన్నారు. మరో 19 చోట్ల కేవలం 36 శాతం మాత్రమే నామినేషన్లు దాఖలు అయ్యాయని అన్నారు.
అభ్యర్థుల దగ్గర అక్నాలెడ్జ్‌మెంట్లు ఉన్నా 6 ఆఫీసుల్లో ఆర్వోల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను చించేశారంటూ మండిపడ్డారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. నామినేషన్ల దశలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రేపు పోలింగ్ రోజు ఇంకెంతటి ఘోరాలు జరుగుతాయో ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు జగన్ రెడ్డి.