భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన ప్రకటన చేశారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ పనులు నవంబర్ నుంచి పునః ప్రారంభం అవుతాయని వెల్లడించారు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ పనులను మంత్రి తనిఖీ చేశారు. ప్రాజెక్ట్ పనులను నిలిపి వేశారు కొన్ని కారణాల వల్ల. చివరకు చట్ట పరమైన అడ్డంకులు తొలగి పోవడంతో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం నవంబర్లో పునః ప్రారంభమవుతుందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అశ్వాపురం మండలంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ పనులను తనిఖీ చేసిన మంత్రి, రాబోయే వేసవిలో తాగునీటి కొరతను నివారించడానికి దుమ్ముగూడెం బ్యారేజీలో నీటి నిల్వను పెంచాలని అధికారులను ఆదేశించారు.
పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చొరవ, సుప్రీంకోర్టు అనుకూల తీర్పుతో న్యాయపరమైన అడ్డంకులు తొలగి పోయాయని చెప్పారు. ఈ నెలాఖరు లోగా కేంద్రం నుంచి తుది అనుమతులు వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్ధసాధక ప్రాజెక్ట్, గౌరవెల్లి రిజర్వాయర్లకు ఇప్పటికే మంజూరు చేసిన పర్యావరణ అనుమతుల చెల్లుబాటును ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జూలైలో సమర్థించిందని వెల్లడించారు తుమ్మల నాగేశ్వర్ రావు. దీంతో వాటి అమలుకు మార్గం సుగమమైందని చెప్పారు. . ఐదేళ్లుగా నిలిచి పోయిన నిర్మాణ పనులను నవంబర్లో పునఃప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దుమ్ముగూడెం బ్యారేజీ వద్ద పూడిక పేరుకు పోవడంతో నీటి నిల్వ సామర్థ్యం సుమారు 0.5 టీఎంసీలకు తగ్గిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
