దేశంలో పోలీసింగ్ విధానాలు మారాలి : రేవంత్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల స‌మ‌వేశంలో

హైదరాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో పోలిసింగ్ విధానాలు మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. శుక్ర‌వారం ద‌క్షిణాది రాష్ట్రాల పోలీస్ ఉన్న‌తాధికారుల స‌మావేశాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగిస్తూ ముఖ్య‌మైన సూచ‌న‌లు చేశారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, కర్ణాటక డీజీపీ డాక్టర్ ఎం.ఏ. సలీమ్, తమిళనాడు డీజీపీ డాక్టర్ మహేష్ అగర్వాల్, పుదుచ్చేరి డీజీపీ షాలిని సింగ్, లక్షద్వీప్ ఏడీజీ బి. శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజీతా బేగం, ఆంధ్రప్రదేశ్ ఐజీపీ రవి కృష్ణ,ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట , లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, సీఐడీ డీజీ చారు సిన్హా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ,ఆపరేషన్స్ విభాగం డీజీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

ఎస్ఆర్పీసీసీ స‌ద‌స్సు హైద‌రాబాద్ లో జ‌రుగుతుండ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. సమాజానికి భద్రత, రక్షణ అనేవి పునాదుల వంటివి అని పేర్కొన్నారు. నైతిక విలువలతో, నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసు వ్యవస్థను అందించాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటారని అన్నారు. నేరాల స్వరూపం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో SRPCC వంటి వేదికలు ఎంతో కీలకం అన్నారు.. పోలీసింగ్ విధానాలు మారాలి. సంస్కరణలు నిరంతరం కొనసాగాలని పేర్కొన్నారు సీఎం. తాను సంస్కరణలను విశ్వసిస్తానని, పోలీసు వ్యవస్థకు మనం అందించే వనరులు ఖర్చు మాత్రమే కాదు. మెరుగైన సమాజ నిర్మాణానికి, పౌరుల భద్రతకు చేసే పెట్టుబడిగా భావిస్తాన‌ని చెప్పారు. హైదరాబాద్ పోలీసు వ్యవస్థను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లుగా ఏర్పాటు చేశామ‌న్నారు. దీంతో ప్రతి పోలీసు కమిషనర్ పరిమిత ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి, మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం కలుగుతుంద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!