BJP : తెలంగాణలో రాజ్యం..తమదేనంటున్న కమలం
BJP : ఎన్నడూ లేనంతగా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో జోష్ పెరిగింది. స్టేట్ చీఫ్ గా ప్రస్తుత ఎంపీగా ఉన్న బండి సంజయ్ రావడంతో ఒక్కసారిగా కమలనాథుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. మాటకు మాటతో ఎప్పటికప్పుడు రాష్టంలో అధికారాన్ని చెలాయిస్తున్న గులాబీ దళపతికి..దళానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఈ యువ నేత. గత కొంత కాలంగా స్టేట్ లో చూసీ చూడనట్లుగా ఉన్న బీజేపీ ఒక్కసారిగా స్పీడు పెంచింది. దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో పరిపాలనలో ఉండడం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించడంతో పాటు అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం, నిధులు, నియామకాల్లో వివక్ష..పోలీసుల నిర్బంధం, రైతులపై దాడులు, కేసులు, మీడియాపై ఆంక్షలు కమలానికి కలిసి వచ్చాయి. ఇదే సమయంలో దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోవడం. ఆయన భార్యకు సీటు ఇవ్వడం దానిని అధికార పార్టీ సీరియస్ గా తీసుకోవడంతో పోటీ నువ్వా నేనా అన్న రీతిలో సాగింది.
ఇదే సమయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసుల దాష్టీకాన్ని కళ్లకు కట్టినట్లు ప్రజలకు తెలియ చెప్పడంలో హరీష్ రావు నేతృత్వంలోని టిఆర్ ఎస్ ఫెయిల్ కాగా బండి సంజయ్ , ధర్మపురి అరవింద్ లు దానిని క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో చివరి వరకు ఐపీఎల్ టోర్నీని తలపింప చేసేలా ఆఖరు రౌండ్ వరకు దేశం యావత్తు ఊపిరి బిగ పట్టి చూసింది. దుబ్బాక రిజల్ట్ కోసం. తెలంగాణ బహుజనులు, నిరుద్యోగులు, పేదలు, నిరాశ్రయులు అంతా మూకుమ్మడిగా టిఆర్ ఎస్ కు బుద్ధి చెప్పాలని కోరుకున్నారు. ఆ దిశగా చాప కింద నీరులా ప్రచారం కూడా చేశారు. ఇదే దుబ్బాకపై శీతకన్ను చూపించడం, నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధిని అడ్డు కోవడంపై సాధారణ జనం సైతం ఇక ఈ ఆగడాలు భరించ లేమంటూ భగ్గుమన్నారు.
ఇరు వర్గాలు..ఇరు పార్టీలకు చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఓ రకంగా పోలింగ్ ను రద్దు చేస్తారేమోనన్న అనుమానం రేకెత్తింది. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముందస్తుగా బైపోల్ నిర్వహిస్తే తమకు లాభం చేకూరుతుందని, ఇక తమ గెలుపునకు ఢోకా ఉండబోదంటూ వ్యూహం పన్నింది. అందులో భాగంగానే ట్రబుల్ షూటర్ గా పేరున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మేనల్లుడైన ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావును బరిలోకి దింపింది. ఇక్కడ అభ్యర్థిని కంటే తన్నీరే కేండిడేట్ అన్నంతగా ప్రచారం చేపట్టారు. దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మనీ, మందు విచ్చలవిడిగా పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. గత ఎన్నికల్లో ఎక్కడ కూడా టిఆర్ఎస్ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో ఓడి పోయిన దాఖలాలు లేవు.
దీంతో తమ విజయానికి ఢోకా లేదని, లక్షన్నర మెజారిటీ ఖాయమని గొప్పలు పోయారు. తీరా జనం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తర్వాత తేలిగ్గా తీసుకున్నారు. బీజేపీ సీఎం కోటలో పాగా వేసింది. ఇంత జరిగినా గులాబీకి జ్ఞానోదయం కాలేదు. ఆ వెంటనే హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు తెర తీశారు. ఎక్కడ కూడా విపక్షాలకు సమయం దొరక నీయకుండా చేశారు. ఎన్నికల కమిషనర్ కు విన్నవించినా ఫలితం లేక పోయింది. వరదలు వచ్చి ఇబ్బందులు పడినా పట్టించుకోని సర్కార్ తీరును కమలం ఎండ గట్టింది. జాతీయ నాయకులను ప్రచారంలోకి దింపింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపించేలా ప్లాన్ చేసింది. ఎన్నికల పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్ గా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. తిరిగి మేయర్ మేమేనని..బీజేపీకి 2 సీట్లు కూడా రావంటూ గేలి చేసింది. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక ఉన్న మెజారిటీని కోల్పోయి చతికిల పడింది. దీంతో ఏం చేయాలో పాలుపోని రీతిలో ఎల్ ఆర్ ఎస్ రద్దు చేసింది.
నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తోంది. ఇదే సమయంలో ప్రజా నాయకుడిగా పేరొందిన నోముల నరసింహయ్య మృతి చెందడంతో నాగార్జున సాగర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో వైపు వరంగల్ , ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా సరే టిఆర్ ఎస్‌కు బుద్ది చెప్పాలని బండి సంజయ్ డిసైడ్ కావడం ఆయనకు కాలం, కమలం సహకరించడంతో ఇపుడు తెలంగాణలో రాబోయే 2023లో అధికారాన్ని చేజిక్కించు కోవాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా బండి ఈ విషయాన్ని స్పష్టం చేశారు కూడా. ఏది ఏమైనా అధికారం ఉంది కదా అని మిడిసి పడితే జనం కర్రు కాల్చి వాత పెడతారని గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
No comment allowed please