Medaram Jatara : ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా, మహా కుంభ మేళాగా భావించే మేడారం జాతర (Medaram Jatara )ప్రారంభమైంది. ఎక్కడ చూసినా జనమే తండోప తండాలుగా తరలి వస్తూనే ఉన్నారు.
ఇవాల్టి నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. సమ్మక్క సారలమ్మలు గద్దెలపై కొలువు తీరారు. కోయ పూజారుల ఎదుర్కోళ్ల అనంతరం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దె పైకి చేరుకుంది.
దీంతో మహా జాతర ప్రారంభమైంది. జంపన్నను నిన్ననే పూజారులు భారీ బందోబస్తు మధ్య గద్దె పైకి తీసుకు వచ్చారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర జరుగుతుంది.
కోయ పూజారులు భక్తులకు ఆశీస్సులు అందిస్తారు. పగిడిగిద్ద రాజును పెళ్లి కొడుకుగా పడిగె ఆకారంలో వెదురు కర్రకు అలంకరించారు. దీంతో జాతర తొలి ఘట్టం అద్భుతంగా ప్రారంభమైంది.
ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ జాతర కొనసాగుతుంది. శివ సత్తులు పూనకాలతో ఊగి పోయారు. ఇక ఈ మేడారం జాతరకు(Medaram Jatara )తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు.
మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ , మహారాష్ట్ర, ఒరిస్సా లోని గిరిజన ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
ఇక 3 వేల 845 బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. 50 ఎకరాలలో బస్టాండ్ ను కూడా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసింది. జంపన్న వాగులో భక్తులు స్నానాలు చేస్తున్నారు.
క్యూ లైన్లలో ఉన్న వారికి నీళ్లు, మజ్జిగను అందిస్తున్నారు. భారీ ఎత్తున ప్రైవేట్ వాహనాలు వస్తూనే ఉన్నాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read : మేడారం జాతరకు సర్వం సిద్దం