Varun Gandhi : భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇంకెంత కాలం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతారంటూ నిలదీశారు.
గత కొంత కాలంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీస్తున్నారు. కేంద్ర సర్కార్ తీసుకు వచ్చిన సాగు చట్టాలను మొట్ట మొదటిసారిగా ఖండించారు. రైతులపై వాహనంతో తొక్కి చంపిన ఘటనపై సీరియస్ అయ్యారు.
కేంద్ర మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. ఇలాగే ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే దేశాన్ని ఎలా రక్షిస్తారంటూ మండిపడ్డారు వరుణ్ గాంధీ(Varun Gandhi ). దేశంలో జోరుగా ప్రైవేటీకరణ జపం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ నిర్ణయం వల్ల అధికారంలో ఉన్న వారికి ఇబ్బంది ఏమీ ఉండదని కానీ ఆ సంస్థలపై ఆధారపడిన వారు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు పూర్తిగా చితికి పోతాయని హెచ్చరించారు.
ఆయన ఉదాహరణ కూడా ఇచ్చారు. కేవలం బ్యాంకింగ్ రంగం, రైల్వేలను ప్రేవేటీకరణ చేయడం వల్ల 5 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని గుర్తు చేశారు.
ఇందుకేనా మనల్ని ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నదంటూ ప్రశ్నించారు వరుణ్ గాంధీ. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వాలు ఎప్పుడూ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవని మండిపడ్డారు.
పెట్టుబడిదారి విధానాన్ని ప్రోత్సహించవు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వరుణ్ గాంధీ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు వ్యాపారవేత్తల కోసం మోదీ పని చేస్తున్నారంటూ రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు.
Also Read : పుర, స్థానిక ఎన్నికల్లో డీఎంకే జోరు