Sanjay Raut : మహారాష్ట్రకు చెందిన మంత్రి నవాబ్ మాలిక్ ను ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. దీంతో మహా వికాస్ అగాధీ ప్రభుత్వానికి చెందిన శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut )తీవ్రంగా స్పందించారు.
మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కోట్లాది రూపాయలు బ్యాంకులను కొల్లగొట్టిన గుజరాత్ కు చెందిన ఏబీజీ షిప్ యార్డు మాజీ చైర్మన్ రిషి అగర్వాల్ గురించి ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు.
ఆయన గుజరాతీ అని వదిలి వేశారా అంటూ నిలదీశారు. తాము ఎందాకైనా పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంత్రి మాలిక్ ను మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు.
బీజేపీయేతర ప్రభుత్వాలను మోదీ ప్రభుత్వం కావాలని టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. అందుకు తగిన రీతిలో బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఏ ఒక్కరినీ వదిలి పెట్ట బోమంటూ నిప్పులు చెరిగారు సంజయ్ రౌత్(Sanjay Raut ). ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాబోయే 2024 తర్వాత బీజేపీ అగ్ర నేతలపై కూడా విచారణ కొనసాగుతుందన్న విషయం గుర్తుంచు కోవాలన్నారు. ఇప్పటికే తాను కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న వైఖరి గురించి ఉప రాష్ట్రపతికి లేఖ కూడా రాశానని చెప్పారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే నవాబ్ మాలిక్ ను ఈడీ కార్యాలయానికి తీసుకు వెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్ రౌత్.
ఒక రాష్ట్రానికి చెందిన మంత్రిని అవమానించడమేనని పేర్కొన్నారు. ఇది బీజేపీ ప్రారంభించిన కొత్త తరహా రాజకీయం అంటూ ఎన్సీపీ నేత సుప్రియా సూలే మండిపడ్డారు.
Also Read : నవాబ్ మాలిక్ ను విచారిస్తున్న ఈడీ