Lavrov : రష్యా తన తీరు మార్చు కోవడం లేదు. రాజ్య కాంక్షతో ఆధిపత్యం చెలాయించాలనే దుగ్ధతో ముందుకు దూసుకు వెళుతోంది. ఓ వైపు ఉక్రెయిన్ ను నామ రూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో రాక్షసానందం పొందుతోంది.
ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తానే పెద్దన్న అనే స్థాయిలో ప్రవర్తించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు యావత్ ప్రపంచం అంతా ఆర్థిక ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతోంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే బాంబుల దాడులతో, మిస్సైళ్లతో విరుచుకు పడుతున్న రష్యా ఉన్నట్టుండి మరో బాంబు పేల్చింది. ఒక వేళ మూడో ప్రపంచ యుద్దం గనుక వస్తే అది అణ్వాయుధాలు, విధ్వంసక ఆయుధాలతోనే జరుగుతుందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ (Lavrov)స్పష్టం చేశారు.
తమ ప్రత్యర్థి దేశం ఉక్రెయిన్ గాను అణ్వాయుధాల సహకారం తీసుకుంటే తాము ఒప్పుకోబోమంటూ హెచ్చరించారు. ఆ దేశం ఇతర దేశాలతో వాటిని పొందకుండా నిరోధించేందుకే తాము ప్రత్యేకంగా మిలటరీ ఆపరేషన్ స్టార్ట్ చేశామని స్పష్టం చేశాడు.
ఎవరు ఎన్ని ఆంక్షలు విధించినా తాము భరించేందుకు సిద్దంగా ఉన్నామని ఎవరి బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. ఉక్రెయిన్ తో చర్చలకు రష్యా సిద్దంగానే ఉందని కానీ అటు వైపు నుంచి స్పందన లేక పోతే తాము ఏమీ చేయలేమన్నారు.
అమెరికా ఆదేశాల వల్లే ఈ చర్చలు సజావుగా సాగనీయకుండా తాత్సారం చేస్తోందంటూ మండిపడ్డారు. ఇరు దేశాలకు చెందిన సైనికులు, పౌరులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఎవరూ తగ్గక పోవడం విచారకరం.
Also Read : యుద్దం ముమ్మరం శాంతి మృగ్యం