NV Ramana : తిరుమల శ్రీవారి, అమ్మ వార్లను భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (NV Ramana)దంపతులు దర్శించుకున్నారు.
ఎన్వీ రమణ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం అందజేసి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మీడియాతో మాట్లాడారు. తిరుమల, తిరుపతికి ప్రతి ఏటా రావడం పరిపాటిగా మారిందన్నారు. ఎక్కడా లేనంతటి ప్రశాంతత ఇక్కడ లభిస్తుందన్నారు.
ప్రధానంగా టీటీడీ పరిశుభ్రత, సుందరీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం బాగుందంటూ ప్రశంసించారు ఎన్వీ రమణ(NV Ramana). రాబోయే కాలంలో కరోనా మహమ్మారి లాంటి భయంకరమైన వ్యాధులు రాకుండా చూడాలని ఆ దేవ దేవుడు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను కోరుకున్నానని తెలిపారు.
అంతకు ముందు కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మావతీ దేవిని జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, వేద పండితులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు.
మొదటగా ధ్వజ స్తంభానికి నమస్కరించుకున్నారు. అనంతరం అమ్మ వారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా శ్రీ అనంతళ్వారు 968వ అవతారోత్సవం తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజ పెద్ద జీయర్ స్వామి ప్రసంగించారు.
అనంతాళ్వార్ స్వామి వారికి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించి తన జీవితాన్ని భగవంతుడి సేవకు సమర్పించు కున్నారంటూ తెలిపారు.
Also Read : త్వరితగతిన సామాన్య భక్తులకు సర్వదర్శనం మా లక్ష్యం