Jagga Reddy : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ఇవాళ సీఎల్పీ సమావేశం జరిగింది.
దీనికి జగ్గారెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో చాలా మాట్లాడాలని అనుకున్నానని, వద్దనడంతో తాను తిరిగి వెళ్లి పోతున్నట్లు తెలిపారు. తనను అవమానించే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావడం ఖాయమన్నారు. ప్రజలకు సంబంధించి, తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తానని చెప్పారు. సమావేశం ప్రారంభంలోనే తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం.
ఇప్పటికే ఆయన పార్టీలో జరుగుతున్న వింత పోకడలు, చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి విసుగు చెందానని తాజాగా జగ్గారెడ్డి (Jagga Reddy)ప్రకటించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై పార్టీ సీనియర్లు నచ్చ చెప్పడంతో తన నిర్ణయానని వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు జగ్గారెడ్డి. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటనపై తనకు సమాచారం లేదని ధ్వజమెత్తారు. ఇదేం పద్దతి అంటూ మండిపడ్డారు.
మొదటి నుంచి సోనియా కుటుంబానికి ఆయన విధేయుడిగా ఉన్నారు. కానీ రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి వ్యవహారంపై పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో డిజిటల్ సభ్యత్వంలో తెలంగాణ టాప్ లో నిలవడం విశేషం.
Also Read : సర్కార్ వ్యవహారం గవర్నర్ ఆగ్రహం