Eatala Rajender : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తాము నిలదీస్తామని స్పష్టం చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala Rajender), రఘునందన్ రావు, రాజా సింగ్.
వీరు సమావేశం కంటే ముందు అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
గవర్నర్ కే దిక్కు లేదని ఇక ఎమ్మెల్యేలకు ఎలా గౌరవం ఇస్తారంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. గన్ పార్క్ వద్ద నల్ల కండువాలతోనే తాము అసెంబ్లీకి అడుగు పెడతామని చెప్పారు.
గత 40 నుంచి 50 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
పూర్తిగా రాచరిక పాలన, నియంతృత్వ ధోరణితో కొనసాగుతోందంటూ ఫైర్ అయ్యారు. తాము ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తామని ఎక్కడా వెనక్కి తగ్గేది లేదన్నారు.
తామున్నది ముగ్గురమే అయినప్పటికీ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామన్నారు. ఒక వేళ దౌర్జన్య పూరితంగా ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే అసెంబ్లీ బయట ప్రజా గొంతుక వినిపిస్తామని చెప్పారు రఘునందన్ రావు.
ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ గవర్నర్ లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్దమంటూ నిప్పులు చెరిగారు. అంతకు ముందు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Also Read : కేటీఆర్ సవాల్ కు రేవంత్ సై