TTD : కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీ ఎత్తున శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ లను దర్శనం చేసుకునేందుకు తరలి వస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
వీఐపీ దర్శనాలను శని, ఆదివారాలలో రద్దు చేసినట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున టీటీడీ (TTD)పాలక మండలి తీసుకున్న నిర్ణయంపై భగ్గుమన్నారు.
దీంతో ఎట్టకేలకు టీటీడీ దిగి వచ్చింది. తాజాగా శ్రీవారిని 61 వేల 052 మంది దర్శించుకున్నారు. 27 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.57 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది. ఇదిలా ఉండగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సామాన్య భక్తుడి మాదిరిగా క్యూలో వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
ఆలయం లోపట సేవలు అందిస్తున్న సేవకులను పరామర్శించారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల పట్ల ప్రేమ పూర్వకంగా , మర్యాదకరంగా వ్యవహరించాలని సూచించారు.
శ్రీవారి సేవ రూపంలో భగవంతుడు ఈ భాగ్యం కల్పించారని, ఏ ప్రాంతంలో సేవ చేసినా ఆ స్వామికి సేవ చేసినట్లేనని టీటీడీ చైర్మన్ అన్నారు.
Also Read : శ్రీవారి సన్నిధిలో సీజేఐ దంపతులు