Bhagwant Mann : పంజాబ్ లో ఆప్ అఖండ విజయం సాధించిన వెంటనే సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ (Bhagwant Mann)తనదైన మార్క్ చూపించడం ప్రారంభించారు. ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో అంతా తమ శాసనసభా పక్ష నేతగా మాన్ ను ఎన్నుకున్నారు.
ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరారు. అంతకు ముందు సర్కార్ ఏర్పాటుకు వీలుగా సీఎం చన్నీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు.
ఆప్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. ఈ తరుణంలో తమ ఎమ్మెల్యేలను ఉద్దేశించి భగవంత్ మాన్(Bhagwant Mann) కీలక ప్రసంగం చేశారు. ఎవరూ రాజధానిలో ఉండ కూడదన్నారు.
ప్రతి ఒక్కరు తమ తమ నియోజకవర్గాలలోనే ఉండాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కేబినెట్ మంత్రేనంటూ పేర్కొన్నారు. మనం ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చాం. వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
అందులో భాగంగానే మీరు మీ నియోజకవర్గాలలో ఉంటేనే వారి సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని చెప్పారు భగవంత్ మాన్. ఇదే సమయంలో ఆయన మరోసారి కీలక ప్రకటన చేశారు.
ఎక్కడా సీఎం ఫోటో ఉండదన్నారు. రెండు ఫోటోలు మాత్రం తప్పక ఉంటాయని చెప్పారు. ఒకరు భగత్ సింగ్ మరొకరు అంబేద్కర్ మాత్రమేనని స్పష్టం చేశారు.
గెలిపించిన ప్రజలు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారంటూ తెలిపారు. ఓటు వేయలేదని దూషించ వద్దు. వారికి కూడా మీరు ఎమ్మెల్యేలన్న సంగతి మరిచి పోవద్దంటూ హితవు పలికారు.
ప్రజలు ఏవైనా ఆలోచనను ప్రతిపాదిస్తే తమ వద్దకు తీసుకు రావాలని సూచించారు మాన్.
Also Read : కొంప ముంచిన మైనార్టీ ఓటర్లు