Rakesh Tikait : భారతీయ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి, రైతు అగ్ర నేత రాకేశ్ తికాయత్ (Rakesh Tikait )సంచలన కామెంట్స్ చేశారు. మూడు సాగు చట్టాలకు మద్దతుగా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికను ఘన్వత్ బహిరంగ పరిచారు.
దీనిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు రాకేశ్ తికాయత్. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ కు తాను కీలుబొమ్మనని మరోసారి నిరూపించు కున్నారంటూ ఆరోపించారు.
దీన్ని సాకుగా చూపించి మళ్లీ రైతులకు వ్యతిరేకంగా బిల్లులు తీసుకు రావాలని చూస్తే మరోసారి దేశం రైతుల ఆందోళనతో దద్దరిల్లుతుందని హెచ్చరించారు రాకేశ్ తికాయత్.
ఇప్పటికే తాము ప్రతిపాదించిన ఆరు డిమాండ్లను ఈరోజు వరకు పరిష్కరించిన పాపాన పోలేదని మండిపడ్డారు. పెద్ద ఎత్తున రైతులు ఇంకోసారి తమ సత్తా చాటేందుకు రెడీగా ఉంటారని, ఈ విషయాన్ని గుర్తుంచు కోవాలని పరోక్షంగా మోదీకి వార్నింగ్ ఇచ్చారు రాకేశ్ తికాయత్(Rakesh Tikait ).
ఇప్పటికే ఎంతో మంది రైతులను పోగొట్టుకున్నాం. భూములను అప్పనంగా కాజేస్తామంటే తామూ ఊరుకోబోమన్నారు. ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన రైతు ఉద్యమం లేదని అనుకుంటే ఎలా అని రాకేష్ తికాయత్ ప్రశ్నించారు.
ప్రాణాలను పణంగా పెట్టిన చరిత్ర రైతులదని తెలుసు కోవాలని అన్నారు. భవంతుల్లో కూర్చుని నివేదికలు తయారు చేస్తే రైతుల బాధలు ఏమిటో తెలియవన్నారు. ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు రానీయకుండా ఉండాలన్నారు.
ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్ముకుంటూ పోతున్న ప్రభుత్వానికి ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని తికాయత్ నిప్పులు చెరిగారు.
Also Read : లాలూ ప్రసాద్ ఆరోగ్యం విషమం