Akhilesh Yadav : ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని, ఇక నుంచి యోగీ సర్కార్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తానని ప్రకటించారు సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కూటమి 125 సీట్లు సాధించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఈ సందర్బంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందచేశారు. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ప్రజల కోసం , ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ మాత్రం త్యాగం అవసరమన్నారు. ప్రభుత్వం కులం, మతం, ప్రాంతాల పేరుతో విభజించి ఎన్నికల్లో లబ్ది పొందిందని ఆయన మండిపడ్డారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక అన్యాయానికి, వివక్షకు వ్యతిరేకంగా తాను అసెంబ్లీలో గళం విప్పుతానని చెప్పారు. అంతకు ముందు ఆయన అజంగఢ్ ఎంపీగా ఉన్నారు.
కోట్లాది మంది ప్రజలు తమకు నైతికంగా మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav). దీనిని గౌరవించేందుకు గాను తాను కర్హల్ నుంచే తన వాయిస్ ను రాష్ట్ర ప్రజల గొంతుకను వినిపిస్తానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎక్కువ సీట్లు ఆయన పార్టీ కూటమికే వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 2 సీట్లలో గెలుపొందితే బీఎస్పీ ఒక్క సీటుకే పరిమితమైంది.
Also Read : సీఎంగా కొలువు తీరిన పుష్కర్ ధామి