#SriSri : నిత్య చైతన్యం శ్రీశ్రీ సంతకం
శ్రీశ్రీ పుట్టుకతొ మనిషి, వృద్దాప్యంలో మహార్షి, మద్యలో మాత్రమే కవి, ఏప్పటికీ ప్రవక్త
Sri Sri : బాధలో ఉన్నప్పుడు, బతుకు బరువైనప్పుడు. గుండెల్లో మంటలు రేగుతున్నప్పుడు. సమాజంలో అసహాయత, దోపిడీ, దౌర్జన్యం ఆధిపత్యమై చెలాయిస్తున్నప్పుడు..ప్రతి చోటా ప్రతి నోటా..ప్రతి సందర్భంలో నిత్యం వినిపించే ఒకే ఒక్క పేరు శ్రీరంగం శ్రీనివాసరావు అలియాస్ శ్రీశ్రీ. తెలుగు సాహిత్యంలో ఆయన పేరు శాశ్వతం. అజరామరం.
శ్రీశ్రీ (Sri Sri ) లాగా ప్రభావితం చేసిన కవులు అరుదు. కవి. రచయిత. అనువాదకుడు. ప్రయోక్త ఇలా చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు. ఆయన రాసిన కవిత్వం నిత్య పఠనం. ప్రతి నిత్యం స్మరణీయం. లక్షలాది ప్రజలను ఆయన కవిత్వం, సాహిత్యం ఇంకా ప్రభావితం చేస్తూనే ఉన్నది. ప్రభవిస్తూనే ఉన్నది. పలకరిస్తూనే పలవరించేలా చేస్తున్నది.
1910లో జన్మించిన ఆయన 1983లో మరణించారు. ఆ కాలంలో ఆయన మిగతా వారి కంటే మెరుగైన రీతిలో రాసుకుంటూ పోయాడు. తన కలం జనపక్షం అన్నాడు. ప్రజల్ని బానిసలు చేసే ప్రతి సమస్యను ఎత్తి చూపాడు. తన అక్షరాలతో మంటలు రేపాడు. విప్లవికవిగా ప్రసిద్ధుడు. సినిమా రచయితగా ఆయన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. తెలుగు సాహిత్యాన్ని శాసించాడు.
సాంప్రదాయ, ఛందోబద్ద కవిత్వాన్ని ధిక్కరించాడు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా పని చేశాడు. శ్రీశ్రీ హేతువాది. నాస్తికుడు. మహా కవిగా పేరొందాడు. ఆయన రాసిన వాటిల్లో ఎన్నదగినది మహాప్రస్థానం. ఈ పుస్తకం సాహిత్యపు దశనూ దిశనూ మార్చింది.
1947లో చెన్నైకి వచ్చాడు. అక్కడే స్థిరపడ్డారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాశాడు. కమ్యూనిస్టుల తరపున శ్రీశ్రీ(Sri Sri )ప్రచారం చేశాడు. 1969లో సమైక్య వాదాన్ని వినిపించాడు. వివిధ దేశాల్లో పర్యటించాడు. ఎన్నో పురస్కారాలు పొందాడు. చిన్నప్పటి నుంచే రాయడం ప్రారంభించాడు.
18 ఏళ్లప్పుడు ప్రభవను ప్రచురించాడు. ఇది గురజాడ అడుగు జాడ అని పేర్కొన్నాడు. విశాఖ నగరం అంటే ఆయనకు అభిమానం. 1950లో మహాప్రస్థానం ప్రచురితమైంది. కవితల సంపుటి. శ్రీశ్రీని(Sri Sri ) మహాకవిని చేసింది ఈ గ్రంథమే. ప్రాసకు శ్లేసకు పెట్టింది పేరు శ్రీశ్రీ. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని సృష్టించడం ఆయన ప్రత్యేకత.
వ్యక్తికి బహు వచనం శక్తి అన్నారు. ఇది ఫేమస్ కోట్. తన ఆత్మ కథను అనంతం పేరుతో ప్రచురించాడు. మహాప్రస్థానంకు చలం ముందు మాట రాశారు. ఎన్నో ఉద్యోగాలు చేశాడు. కొన్నేళ్ల పాటు సినిమా రంగంలో ఉన్నారు. కన్యాదానం సినిమాకు ఒక్క రోజులో 12 పాటలు రాశాడు.
ఇది ఒక రికార్డు. చెవిలో రహస్యం అనే సినిమా తీసి నష్ట పోయాడు. శ్రీశ్రీ జీవితం భిన్న ధృవాలతో కూడుకున్నది. ఆయనతో విభేదించే వారు సైతం ఆయన రాసిన వాటిని ఒప్పుకున్న సందర్భాలు ఎన్నో. తెలుగు భాషకు కవిత్రయం తిక్కన. వేమన. గురజాడ అన్నారు.
శ్రీశ్రీ పుట్టుకతొ మనిషి, వృద్దాప్యంలో మహార్షి, మద్యలో మాత్రమే కవి, ఏప్పటికీ ప్రవక్త అన్న వేటూరి సుందర రామ్మూర్తి మాటలు అక్షర సత్యాలు. శ్రీశ్రీ మనలోని కవి..మహాకవి. మరిచి పోలేని కవి.
No comment allowed please