RR vs KKR IPL 2022 : రాజస్థాన్ ధనా ధన్ కోల్ కతా పరేషాన్
దంచి కొట్టిన జోస్ బట్లర్..తిప్పేసిన చహల్
RR vs KKR : నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్. చివరి వరకు విజయం ఇరు జట్లకు దోబూచు లాడిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. ముంబై వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (RR vs KKR)రాజసాన్ని ప్రదర్శించింది.
7 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించింది. ఐపీఎల్ లో ఉన్న మజా ఏంటో ఈ మ్యాచ్ రుచి చూపించింది.
టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఇక మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ చెలరేగుతూ పోయింది. ఆ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ అద్భుతంగా ఆడాడు.
ఒకరకంగా చుక్కలు చూపించాడు కోల్ కతా బౌలర్లకు. ఈ మెగా రిచ్ టోర్నీలో ఏకంగా రెండో సెంచరీ నమోదు చేశాడు.
కేవలం 59 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 103 పరుగులు చేసి ఆఖరులో వెనుదిరిగాడు.
ఇక కెప్టెన్ సంజూ శాంసన్ 38 పరుగులు చేసి రాణించగా దేవదత్ పడికల్ 28 , హిట్ మైర్ 26 రన్స్ చేసి భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించారు.
5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు చేసింది. అనంతరం 218 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ చివరి దాకా పోరాడింది.
యుజ్వేంద్ర చహల్ మరోసారి తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. కోల్ కతా పతనాన్ని శాసించాడు.
అరోన్ ఫించ్ , శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడారు. టార్గెట్ కు దగ్గరగా చేర్చారు.
కాగా 17వ ఓవర్ లో చహల్ హ్యాట్రిక్ తో సహా నాలుగు వికెట్లు తీయడంతో కేకేఆర్ పని ఖతం అయ్యింది.
ఆఖరులో ఉమేష్ యాదవ్ సిక్సర్లు , ఫోర్ తో దుమ్ము రేపినా ఓబెడ్ మెకోయ్ ఆఖరి ఓవర్ లో వరుసగా రెండు వికెట్లు తీశాడు
. దీంతో చహల్ 5 వికెట్లు తీస్తే మెకోయ్ 4 వికెట్లు ప్రసిద్ద్ కృష్ణ ఒక వికెట్ తీశాడు.
Also Read : మాలిక్ మామూలోడు కాదు మగాడులో సైతం