Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. ఎలాంటి కారణం లేకుండా ఊరేగింపులు, కవాతులకు అనమతించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమీక్షా సమావేశానికి సీఎం అధ్యక్షత వహించారు.
ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో ఇటీవల జరిగిన ఘర్షణలను పరిగణలోకి తీసుకొని ఈ ఆదేశాలను జారీ చేసినట్లు చెప్పారు. వచ్చే నెల ప్రారంభంలో రంజాన్ , అక్షయ తృతీయ పండుగలు ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు యోగి ఆదిత్యానాథ్.
ఒకవేళ పర్మిషన్ కావాలంటే సరైన కారణం చూపాలని అన్నారు. అనుమతి ఇవ్వడానికి ముందు నిర్వాహకులంతా శాంతి, సామరస్యాన్ని కాపాడుకుంటామని హామీ ఇచ్చే ఆఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని కుండ బద్దలు కొట్టారు.
మత పరమైన సంప్రదాయ ఉత్సవాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుందన్నారు సీఎం. కొత్త కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి ఇచ్చేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
కొత్త ప్రదేశాలలో మైక్రో ఫోన్ ల కోసం పర్మిషన్ ఉండదన్నారు. ఇప్పటికే లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తున్న వారు ఎవరికీ అంతరాయం కలిగించకుండా సౌండ్ తగ్గించు కోవాలని సూచించారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath).
మే 4 వరకు రాష్ట్రంలోని అన్ని పోలీసు, పరిపాలనా అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శాంతి భద్రతల కోసం 24 గంటల్లో మత పెద్దలు, ప్రముఖులతో చర్చలు జరపాలని ఆదేశించారు.
ప్రస్తుతం సెలవుల్లో ఉన్న వారు సైతం విధుల్లో చేరాలని, ఆ విషయాన్ని సిఎంఓకు తెలియ చేయాలని స్పష్టం చేశారు సీఎం. సున్నిత ప్రాంతాలలో అదనపు పోలీస్ బలగాలను మోహరించాలని సూచించారు
Also Read : ఢిల్లీ ఘర్షణలో కీలక నిందితుడి అరెస్ట్