Arvind Kejriwal : కేరళపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్
ట్వంటీ 20 పార్టీతో పొత్తు
Arvind Kejriwal : ఢిల్లీలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఏకంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. 117 సీట్లకు గాను ఆప్ 92 సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, శిరోమణి అకాలీదళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఇదే సమయంలో త్వరలో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై దృష్టి సారించింది. అవినీతి రహిత పాలన పేరుతో ముందుకు వెళుతున్నారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). దేశ వ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉన్నారు.
గోవాలో ఆ పార్టీకి రెండు సీట్లు దక్కాయి. ఇదే సమయంలో తాజాగా ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ కేరళలో పర్యటించారు. దక్షిణాది రాష్ట్రంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కేరళలోని ట్వంటీ 20 పార్టీతో పొత్తు పెట్టుకుంది.
కొచ్చిని సందర్శించిన కేజ్రీవాల్ ఆ పార్టీతో కలిసి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ట్వంటీ 20 పార్టీ ఆప్ తో కలిసి కొత్త అలయన్స్ అన్నమాట. ఇప్పటికే కేరళలో ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తోంది.
ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. బీజేపీ, కాంగ్రెస్ పాగా వేయాలని చూస్తున్నాయి. ఇంతలో అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా కేరళలో ఎంటర్ అయ్యారు. కేరళలో ప్రస్తుతం నాలుగు రాజకీయ కూటములు ఉన్నాయని ఈ సందర్భంగా కేజ్రీవాల్(Arvind Kejriwal) చెప్పారు.
ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీయేతో పాటు తమ కూటమి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ కూడా ఒకటి అన్నారు. సంచలన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్.
రాజకీయాలు, అల్లర్లు, అవినీతి కావాలంటే ఆ పార్టీలను కోరుకోండి. మీకు అభివృద్ది, బడులు, ఆస్పత్రులు కావాలంటే మాకు సపోర్ట్ చేయాలని కోరారు.
Also Read : ‘పార్లమెంటరీ బోర్డు’ తిరస్కరణ