Rahul Gandhi : ప్ర‌జ‌ల‌తో దూరం పార్టీకి శాపం

నిజం ఒప్పుకున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi : చాన్నాళ్ల‌కు వాస్త‌వాన్ని గుర్తించారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) . ఎట్ట‌కేల‌కు నోరు విప్పారు. నిజం మాట్లాడారు. దేశంలో ఏ పార్టీకి లేనంత‌టి బ‌లం, బ‌ల‌గం ఉన్నా ఎన్నిక‌ల్లో గెలుపొంద‌లేక పోతున్నామ‌నే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శివిర్ ఈనెల 13 నుంచి 15 వ‌ర‌కు మూడు రోజుల పాటు జ‌రిగింది. ఇందులో ప్ర‌ధాన అంశాల‌ను చ‌ర్చించారు.

ప్ర‌ధానంగా కేంద్ర స‌ర్కార్ పై పోరాడాల‌ని పిలుపునిచ్చారు. ప‌నిలో ప‌నిగా కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు వ‌చ్చే అక్టోబ‌ర్ 2న అంటే మ‌హాత్మా గాంధీ జ‌యంతి రోజున పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ.

ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). పార్టీ ప్ర‌జ‌ల‌కు దూర‌మైంద‌ని, ఇక నుంచి వారి మ‌ధ్య‌నే ఉండాల‌ని పార్టీ శ్రేణులు, నాయ‌కులు, సీనియ‌ర్లు, బాధ్యులు, ప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌ల‌కు హిత‌బోధ చేశారు.

ఇంట్లో కూర్చుంటే పార్టీ న‌డ‌వ‌ద‌న్నారు. ముందు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లండి. వారి మ‌ధ్య‌నే ఉండండి. వారి స‌మ‌స్య‌లు ఏమిటో గుర్తించండి. ప్ర‌భుత్వాల‌ను నిల‌దీయండి అంటూ పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.

ఇలాగైతే పార్టీ మున‌గ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు. పార్టీ ప‌ట్ల ఎవ‌రు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినా ఊరుకోనంటూ హెచ్చ‌రించారు. క‌ష్ట‌ప‌డే వారికి ఎప్ప‌టికీ గుర్తింపు ఉంటుంద‌న్నారు.

ఇది గుర్తించి కార్య‌క్షేత్రంలోకి దూసుకు వెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ.ఏ మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించినా స‌హించ బోమ‌న్నారు.

Also Read : నోరు పారేసుకున్న ఆర్బీఐ మెంబ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!