KTR Davos : లైఫ్ సైన్సెస్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యం. అదో విడదీయలేని భాగంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ విజన్ ఫర్ 2030 అనే అంశంపై దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి ప్రసంగించారు.
తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానంగా కరోనా కష్ట కాలంలో లైఫ్ సైన్సెస్ ప్రాముఖ్యత ఏమిటో ప్రపంచానికి అంతటికీ తెలిసిందన్నారు.
భారత్ ఆ దిశగా ఆ రంగంలో కీలక పాత్ర పోషించాలంటే తప్పనిసరిగా సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు మంత్రి కేటీఆర్(KTR Davos).
కాగా ఆయన మరోసారి కేంద్రాన్ని ఈ సందర్భంగా తప్పు పట్టారు. తాము ఒక స్పష్టమైన విజన్ తో ముందుకు వెళుతున్నామని, కానీ మోదీ ప్రభుత్వం కావాలని మోకాలడ్డుతోందని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్.
ప్రధానంగా భాగ్యనగరంలోని ఫార్మా సిటీకి కావాల్సినంత సపోర్ట్ లభించడం లేదని ఆవేదన చెందారు. అయినా తమ ప్రభుత్వం ప్రముఖ సంస్థలతో కలిసి పని చేస్తోందని చెప్పారు.
తాము తీసుకు వచ్చిన టీఎస్ ఐపాస్ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పుడు ఇండియా అంటేనే హైదరాబాద్ ను ఎంచుకుంటున్నాయని తెలిపారు.
జీవ శాస్త్ర రంగంలో నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్ ను హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు కేటీఆర్(KTR Davos).
ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ లో పరిశోధన, డెవలప్ మెంట్ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు వీలుగా సులభతరమైన విధానాలు అవసరమన్నారు.
Also Read : మాదే రాజ్యం టీఆర్ఎస్ పతనం ఖాయం