Mamata Banerjee : కాషాయం దేశానికి అత్యంత ప్రమాదం
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీపై. కాషాయం ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమని, దానిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.
రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నామ రూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు సీఎం. బెంగాల్ లోని పురూలియా జిల్లాలో తృణమూల్ కార్యకర్తల సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొని ప్రసంగించారు.
కాషాయ శిబిరాన్ని ఓడించేందుకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రదర్శిస్తున్న ద్వేషం, హింసాత్మక రాజకీయాలు దేశ వ్యాప్తంగా పని చేయవని జోస్యం చెప్పారు దీదీ.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వానికి విలువలంటూ లేవన్నారు. నోట్ల రద్దుతో దేశాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
ప్రతిపక్షాల నోరు మూయించేందుకు కేంద్ర ఏజెన్సీలను ప్రయోగిస్తోందని, అయినా ప్రజలు బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారని అన్నారు సీఎం.
2024లో బీజేపీకి అంత సీన్ లేదు. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ సాధించింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మడం తప్ప ఈ సర్కార్ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
పురూలియా నేల, బెంగాల్ మట్టి నాకు ప్రజల కోసం పోరాడేందుకు శక్తిని ఇచ్చాయని మమతా బెనర్జీ చెప్పారు. తాను ఎవరికీ భయపడనని, ప్రజల సంక్షేమం కోసం రాజీ పడడని, విజయం సాధించేంత వరకు తాను పోరాడుతూనే ఉంటానని చెప్పారు.
మోదీ ప్రభుత్వం బూటకపు వాగ్ధానాలతో పవర్ లోకి వచ్చిందని కానీ ఇప్పుడు విఫలమైన ప్రయోగాలతో ముగిసిందన్నారు.
Also Read : సేవా సంస్థలకు హెచ్‌సీఎల్ ఆసరా