Arvind Kejriwal : కేంద్ర సర్కార్ పై కేజ్రీవాల్ ఫైర్
కక్ష సాధింపు ధోరణి మానుకోవాలి
Arvind Kejriwal : కేంద్రం కావాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందంటూ ఆరోపించారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
బీజేపీయేతర రాష్ట్రాలు, వ్యక్తులు, సంస్థలు, నాయకులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులకు గురి చేయడం అలవాటుగా పెట్టుకుందని మండిపడ్డారు.
శనివారం ఆయన కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ తమ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేశారని, ఈరోజు వరకు వారికి ఎలాంటి ఆధారాలు లభించ లేదని మండిపడ్డారు.
ఎంత సేపు కేసులు నమోదు చేయడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బీజేపీకి ఒక అలవాటుగా మారిందన్నారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇప్పుడు సత్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేశారు.
ఇక తర్వాత కేంద్రం టార్గెట్ నా సహచరుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఉంటారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఇది తనకు అంతర్గత సమాచారం ఉందన్నారు.
ఏదో ఒక నెపంతో అభియోగాలు మోపడం, కేసులు నమోదు చేయడం, అదుపులోకి తీసుకోవడం గత ఎనిమిదేళ్ల మోదీ పాలనలో జరుగుతున్నది ఇదేనని ఎద్దేవా చేశారు.
తాము విద్య, వైద్యం, ఉపాధి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని కానీ కేంద్ర సర్కార్ ఎలా ఇతరులను తొక్కి పెట్టాలని ఆలోచిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం.
తమ ప్రభుత్వం పాలనలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచామన్నారు. 2015లో అవినీతికి పాల్పడిన మంత్రిని తాను తొలగించానని, తాజాగా పంజాబ్ లో తమ పార్టీకి చెందిన మినిష్టర్ ను సీఎం భగవంత్ మాన్ తీసి వేశారని ఇది తమ చరిత్ర అని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).
Also Read : సిద్దూ ఫ్యామిలీకి అమిత్ షా ఓదార్పు