Imran Khan : ఇమ్రాన్ హత్యకు కుట్ర..సెక్యూరిటీ పెంపు
కుట్ర నిజమేనన్న పాకిస్తాన్ నిఘా విభాగం
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారంటూ ప్రచారం జోరందుకుంది. దీనిపై పాకిస్తాన్ నిఘా సంస్థలు సైతం వాస్తవమేనంటూ తేల్చడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ఈ మేరకు దేశ ప్రభుత్వం మాజీ ప్రధాన మంత్రికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని ఆదేశించింది. సెక్యూరిటీ ఏజెన్సీలు సైతం అంతర్గత నివేదికలో ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందంటూ హెచ్చరించాయి.
ఇస్లామాబాద్ అలర్ట్ లో ఉంది. చట్ట ప్రకారం మాజీ ప్రధాన మంత్రికి పూర్తి భద్రత కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ ను మట్టుపెట్టేందుకు ప్లాన్ జరిగిందని జోరుగా ప్రచారం జరిగింది.
బనిగాలా పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు ఇస్లామాబాద్ పోలీస్ విభాగం స్పష్టం చేసింది. బనిగాలాకు రానున్న దృష్ట్యా ఇమ్రాన్ ఖాన్ కు మరింత భద్రత పెంచినట్లు తెలిపింది.
కాగా ఇమ్రాన్ ఖాన్ బృందం తరపు నుంచి ఎలాంటి సమాచారం తమకు ఇంత వరకు రాలేదని వెల్లడించారు పోలీసులు. ఇస్లామాబాద్ లో 144 సెక్షన్ విధించామన్నారు.
జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎటువంటి సమావేశానికి పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ తెహ్రక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు ఏదైనా జరిగితే ఆ చర్యను పాకిస్తాన్ పై దాడిగా పరిగణిస్తామని ఖాన్ మేనల్లుడు హసన్ నియాజీ హెచ్చరించారు.
ఆరు నూరైనా సరే ఇమ్రాన్ ఖాన్(Imran Khan) హాజరవుతారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని పీటీఐ నాయకుడు ఫవాద్ చౌదరి స్పష్టం చేశారు.
Also Read : విమానం కలకలం వైట్ హౌస్ అప్రమత్తం