Revanth Reddy : మోదీ మూల్యం చెల్లించుకోక తప్పదు
హెచ్చరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : గాంధీ ఫ్యామిలీపై కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy).
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నేత, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని ప్రశ్నించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. జాతీయ పార్టీకి చెందిన లీడర్ ను 12 గంటల పాటు ఎలా ప్రశ్నిస్తారంటూ నిలదీశారు.
మంగళవారం హైదరాబాద్ ఈడీ ఆఫీసు ఎదుట రెండో రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
దేశంలో కులాలు, మతాలు, వర్గాల పేరుతో విభజించి పాలించాలనే కుట్ర ఎల్లకాలం చెల్లదన్నారు. ఏనాడో కొట్టి వేసిన కేసును తిరిగి ఎలా తెరుస్తారంటూ ప్రశ్నించారు.
ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి కాదన్నారు. గాంధీ ఫ్యామిలీ దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకుంది, త్యాగాలు చేసింది భారతీయ జనతా పార్టీ పరివారంలో ఎవరైనా అలాంటి త్యాగాలు చేసిన వారున్నారా. ఉంటే చెప్పాలన్నారు.
బడా వ్యాపారవేత్తలకు గంప గుత్తగా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టే పనిలో ఉన్న మోదీకి ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీని చూసి తట్టుకోలేక పోతున్నారని ఆరోపించారు.
అందుకే ఎలాగైనా సరే గాంధీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని ఇలాంటి ఆధారాలు లేని అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
రూల్స్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకే విచారణ జరపాలని కానీ 12 గంటల పాటు ఏక ధాటిగా ఎలా విచారణ జరుపుతారంటూ సీరియస్ అయ్యారు.
Also Read : 10 లక్షల ఉద్యోగాల భర్తీకి మోదీ ఆదేశం