Madhu Yaski Goud : రాకేష్ కుటుంబానికి రూ. కోటి ఇవ్వాలి
అగ్నిపథ్ స్కీం వెంటనే రద్దు చేయాలి
Madhu Yaski Goud : కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు మధు యాష్కి గౌడ్ (Madhu Yaski Goud) షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం వల్ల యువతకు ఎలాంటి లాభం ఉండదన్నారు.
ఇప్పటికే దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మడమో లేదా లీజుకు ఇస్తూ వస్తున్న మోదీ ప్రభుత్వ కన్ను ఇక ఆర్మీపై పడిందని ఆరోపించారు.
చివరకు దేశ రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలో భాగంగా వచ్చిన పథకమే ఈ అగ్నిపథ్ స్కీం అని మండిపడ్డారు మధు యాష్కి గౌడ్.
ఇదే సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో మరణించిన వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ చని పోయాడని తెలిపారు.
బాధితుడి కుటుంబానికి కేంద్రం రూ. కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అతడి చావుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
మిలటరీని ప్రైవేటీకరించాలని అనుకోవడం దారుణమన్నారు. సైనిక విభాగాల్లో జీతాలు, ఇతర ఖర్చులు తగ్గించు కోవాలన్న దుర్మార్గమైన ఆలోచన తప్ప మరొకటి కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కీం ఒప్పుకోదని చెప్పారు మధు యాష్కి గౌడ్. కరోనా పేరుతో ఆర్మీ రిక్రూట్ మెంట్ ను నిలిపి వేస్తూ వచ్చారని ఆరోపించారు.
చివరకు సాయుధ బలగాల్లో కూడా కాంట్రాక్టు వ్యవస్థను తీసుకు వచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇంకెక్కడుంది ప్రధాన మంత్రికి దేశ భక్తి అని ప్రశ్నించారు.
ఓ వైపు అగ్నిపథ్ దెబ్బకు దేశం తగులబడి పోతుంటే ఎందుకు మోదీ నోరు విప్పడం లేదని నిలదీశారు.
Also Read : ఆందోళన ఆపం చచ్చేందుకు సిద్దం